AP Registration Charges : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, ఆ 29 గ్రామాలకు మినహాయింపు
AP Registration Charges : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు.
AP Registration Charges : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఛార్జీల పెంపుదల సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. అమరావతిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.... రిజిస్ట్రేషన్ విలువ హేతుబద్ధీకరణ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్‌లో చర్చించి, పరిష్కరిస్తామని చెప్పారు.
అమరావతిలో పెంపుదల లేదు
గుంటూరు, మార్కాపురం ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ తక్కువే ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొన్ని చోట్ల తగ్గిస్తే, మరికొన్ని చోట్ల పెంచుతున్నట్లు పేర్కొన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు మంత్రి తెలియజేశారు.
15-20 శాతం పెంపు!
రాష్ట్రాభివృద్ధికి అవసరమైన రెవెన్యూ కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. డిమాండ్ ఉన్న ఏరియాల్లో భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇది రెవెన్యూ ఆదాయాన్ని పెంచి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.
భూసమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదల భూముల వివరాలు మార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారన్నారు. సీఎం చంద్రబాబును దావోస్ పర్యటనలో చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులపై హామీ ఇచ్చారన్నారు.