ACB On Revenue Offices: రెవిన్యూ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు వద్దు.. ఉద్యోగుల సంఘం డిమాండ్
ACB On Revenue Offices: రెవిన్యూ కార్యాలయాల్లో తాసీల్దార్లను వేధింపులకు గురి చేసేలా ఏసీబీ సోదాలు, తనిఖీలను నిలిపి వేయాలని రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
ACB On Revenue Offices: తాశీల్దార్లను లక్ష్యంగా చేసుకునేలా రెవిన్యూ కార్యాలయాల్లో దాడులతో ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం తగదని ఏపీరెవిన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రెవిన్యూ ఉద్యోగులకు కార్యాలయాలలో కనీస మౌలిక సదుపాయములు, కనీస నిధులు కల్పించడం ద్వారా, పనిచేసే సానుకూల వాతావరణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని గుర్తు చేశారు.
మారుతున్నవాటితో పాటు నూతన చట్టాలు, సవరణలు, సాఫ్ట్‌వేర్‌లపై రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ అవసరమని శిక్షణను ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఏపీలో వి.ఐ.పి పర్యటనలు మరియు ప్రోటోకాల్ ఖర్చులకు బడ్జెట్ కేటాయించాలని అవసరాలను గుర్తించకుండా ఉద్యోగులను బాద్యులను చేయడం ఏమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని, రెవెన్యూ ఉద్యోగుల బాధలు, ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియనివి కాదని 3, 4 నెలలుగా జీతాలు లేవని అనేక అవసరాలుంటాయని రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు.
కృష్ణా, తిరుపతి జిల్లాల్లో రెవిన్యూ అధికారుల వద్ద కారులో నగదు దొరికితే లంచం తీసుకున్నట్టు ఎలా నిర్ధారిస్తారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులను వేధించడం సరికాదని హితవు పలికారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆదివారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ శాఖలో సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగుల పనితీరులో నాణ్యత లేదని అభిప్రాయపడ్డారు.
కొత్తగా నియమితులైన జూనియర్ అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణనిచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి భూచట్టాల్లో మార్పులు వస్తున్నాయని వివరించారు. రెవెన్యూలో 120కి పైగా చట్టాలున్నాయని.. వీటిపై కనీస శిక్షణ, అవగాహన లేకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.
రెవెన్యూ ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న నేపథ్యంలో తాసీల్దారు కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలలో, కలెక్టర్ కార్యాలయాలలో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, పనిచేసే సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే లక్ష్యాలను చేరుకోవడంతో రెవెన్యూ ఉద్యోగులు లక్ష్యాలను చేరుకుంటారన్నారు.
రెవెన్యూ ఉద్యోగులకు పని చేసే సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుని, పౌరులకు పారదర్శకంగా సేవలు అందించి ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకొస్తామన్నారు.
ఇటీవల తాశీల్దారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి కార్యాలయాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు పేరుతో రెవెన్యూ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వారిని శిక్షించాలి తప్ప అనవసరంగా నిజాయితీగా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులపై ఆకస్మిక తినిఖీల పేరున భయ భ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు.
రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులైన రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రెవిన్యూ అధికారి, సంయుక్త కలెక్టరు, జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనికీలు చేస్తారని, ఏ.సి.బీ అధికారుల తో వ్యక్తిగత స్వేచ్ఛ కు భంగం కలిగిస్తూ తనిఖీలు చేయించడం తగదని ప్రభుత్వానికి తమ అభ్యంతరం తెలిపారు.