AP Revenue Meetings: భూ సమస్యలపై రేపట్నుంచి ఏపీ అంతట రెవిన్యూ సదస్సులు, వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారం
AP Revenue Meetings: రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలు, వివాదాలు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి గ్రామ, వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డులపై కూడా కసరత్తు చేస్తారు.
AP Revenue Meetings: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6వతేదీ నుండి వచ్చే జనవరి 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రాథమిక ఉద్దేశ్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

సదస్సుల సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీహోల్డ్ మరియు సెక్షన్ 22A కు సంబంధించిన భూ ఆక్రమణ సమస్యలతో ప్రభావితమైన వారి నుండి ముందస్తు సమాచారంతో వినతులను స్వీకరించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ జిల్లా షెడ్యూల్‌ను ఖరారు చేసి, గ్రామ,మండల స్థాయి పిటిషన్ల స్వీకరణ,పరిష్కార విధానాన్ని పర్యవేక్షించి సకాలంలో ఆయా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నిటినీ రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ(RTGS) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లోని ప్రత్యేక విండోలో ఆన్‌లైన్లో పొందుపరుస్తారు. షెడ్యూల్ ప్రకారం,రెవెన్యూ సదస్సులు ప్రతి రోజు ఉదయం 9.00 గంటలకు రెవెన్యూ గ్రామంలో నిర్దేశించిన ప్రదేశంలో నిర్వహించాలని సిసోడియా తెలిపారు.
ఈనెల 6వతేదీన రెవెన్యూ సదస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలై జవనరి 8వతేదీ వరకు నిర్వహించబడతాయని సిసోడియా వెల్లడించారు.ఈరెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్‌ను సమన్వయకర్తగా ఉంటారని,సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను వారి వారి డివిజన్‌ల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఈనెల 5వతేదీ లోగా షెడ్యూల్ ఖరారు చేసే విధంగా జిల్లా కలక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా చిన్న రెవెన్యూ గ్రామాలకు ఒకపూటలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తగినంత కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న సరైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు.రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలకు తెలియ జేయడానికి స్థానిక మీడియాను ఉపయోగించి విస్తృత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఈసమావేశాల ఉద్దేశ్యం,సదస్సులు జరిగే తేదీలు,వేదిక వివరాలతో కూడిన కరపత్రాలు మరియు పోస్టర్లను అన్ని గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల తేదీ మరియు స్థలాన్ని టాం-టాం ద్వారా గ్రామస్తులకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ కార్యాలయం,పాఠశాల,గ్రామ సంస్థ కార్యాలయం,ఐకెపి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలని తెలిపారు.
తహసీల్దార్,రెవెన్యూఇన్స్పెక్టర్,సంబంధిత గ్రామాల వి.ఆర్.ఓ,మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ శాఖప్రతినిధి,అవసరమైన చోట్ల అటవీ దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈఅధికార బృందాలు ఆయా గ్రామాల సందర్శన గురించి గ్రామస్తులకు ముందస్తుగా తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని సిసోడియా జిల్లా కలక్టర్లను ఆదేశించారు.జిల్లా స్థాయి అధికారులను మండల నోడల్ అధికారులుగా నియమించి వారి ఆధ్వర్యంలో ఈరెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలక్టర్లను ఆదేశించారు.
33 రోజులు పాటు రెవిన్యూ సదస్సులు
అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈనెల ఆరో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ పాపాల పరంపర కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని, వాటన్నింటికీ పరిష్కారం చూపేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రెవెన్యూ సదస్సుల్లో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల భూ రికార్డులను ప్రదర్శిస్తామని చెప్పారు. గ్రామంలో ఉన్న అసైన్డ్ భూములు, ప్రీ హోల్డ్ భూములు, లీజ్ భూములు, కేటాయింపు భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు రెవెన్యూ సదస్సుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఆ గ్రామంలో ఎన్ని ఇళ్ల పట్టాలు మంజూరు చేశారనే వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు.
అక్రమ ఇళ్ల పట్టాలపై విచారణ…
గత ప్రభుత్వంలో 22 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ వాటిల్లో పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఇళ్ల స్థలాలు నావి అని చెప్పుకునేందుకు ముందుకు రావడం లేదని, అంటే ఇళ్ల పట్టాల మంజూరులోనూ పెద్ద కుంభకోణం జరిగిందని అర్ధమౌతోందన్నారు. వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను కట్టబెట్టినట్లు తెలుస్తోందని, వీటన్నింటిపైన రెవెన్యూ సదస్సుల్లో చర్చించి లబ్దిదారుల జాబితాలను వెల్లడించి అనర్హులను తేలుస్తామని చెప్పారు. అనర్హులుగా తేలిన వారి నుండి ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు.
ఇళ్ల పట్టాల అంశంలోనే కాక అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్ చేసిన వాటిల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా అనేది కూడా రెవెన్యూ సదస్సుల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. లీజు భూములు, కేటాయింపు భూములు ఆ గ్రామంలో ప్రయోజనకరంగా ఉన్నాయో లేవో పరిశీలిస్తామని, వాటిల్లనూ అక్రమాలు జరిగితే వాటిని తిరిగి తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల భూములను అక్రమంగా 22ఏ లో చేర్చారా లేదా అనే అంశాన్ని కూడా రెవెన్యూ సదస్సుల్లో పరిశీలిస్తామని, ఎవరైనా నష్టపోతే వారికి న్యాయం చేస్తామని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన కూడా రెవెన్యూ సదస్సుల్లో చర్చిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.