AP Passenger Traffic : ప‌ల్లెల‌కు టాటా.. బ‌రువెక్కిన గుండెల‌తో ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌యాణం!-return journey from villages to cities after sankranti in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Passenger Traffic : ప‌ల్లెల‌కు టాటా.. బ‌రువెక్కిన గుండెల‌తో ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌యాణం!

AP Passenger Traffic : ప‌ల్లెల‌కు టాటా.. బ‌రువెక్కిన గుండెల‌తో ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌యాణం!

HT Telugu Desk HT Telugu
Jan 17, 2025 02:19 PM IST

AP Passenger Traffic : సంక్రాంతికి స్వ‌గ్రామాల‌కు వెళ్లిన వారు ఆ ప‌ల్లెల‌కు టాటా చెప్పి, బ‌రువెక్కిన గుండెల‌తో ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌యాణం అవుతున్నారు. గురువారం నుంచి ప్రారంభ‌మైన‌ తిరిగి ప్రయాణాలు కొన‌సాగుతునే ఉన్నాయి. దీంతో రైల్వేస్టేష‌న్లు, బ‌స్ కాంప్లెక్స్‌లు ప్ర‌యాణికుల‌తో నిండిపోయాయి.

ప్రయాణికుల రద్దీ
ప్రయాణికుల రద్దీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అయిపోయింది. భోగి, సంక్రాంతి, క‌నుమ మూడు రోజుల పాటు కుటుంబ స‌భ్యులు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల‌తో గడిపిన ప్ర‌జ‌లు.. ఆ జ్ఞాప‌కాల‌ను మ‌ది నిండా నింపుకొని తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. బాగున్నావా, బాగున్నారా.. ఎప్పుడోచ్చారేంటీ.. కుటుంబ‌మంతా వ‌చ్చారా? అంటూ ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు, ఉన్న‌త చ‌దువుల కోసం దేశ విదేశాల్లో ఉంటూ.. సంక్రాంతి పండ‌క్కి వ‌చ్చిన బంధువులు, స్నేహితులు ప‌ల‌క‌రింపులు.. దానికి స్పందిస్తూ ఆయ్ బాగున్నామండి.. నిన్న‌నే వ‌చ్చామండి, ఈ రోజే వ‌చ్చామండి, అంద‌రం వ‌చ్చామండి అంటూ స‌మాధానాలు. ఇలా ప‌ర‌స్ప‌ర ప‌ల‌క‌రింపులు, ఆప్యాయ‌తులు న‌డుమ సంక్రాంతి జ‌రిగింది.

పల్లెల్లో హడావుడి..

అల్లుళ్ల రాక‌తో ఆయా ఇళ్ల‌లో హ‌డావుడి అంతా ఇంతా కాదు. అందులోనూ కొత్త అల్లుళ్లైతే హ‌డావుడి రెట్టింపు ఉంటుంది. అల్లుడు గారు ఏం తింటారు? వారికేం ఇష్టం? అంటూ కుమార్తెల‌ను అడిగి మ‌రి అత్త‌లు హ‌డావుడి చేస్తారు. తాత‌లు, అమ్మ‌మ్మ‌లు, నాన్న‌మ్మ‌లు మ‌న‌వాళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో గడుపుతారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్లలు ఇంటికి వ‌చ్చిన ఆనందంలో ఖ‌ర్చుల‌కు వెన‌క‌డుగు వేయ‌కుండా, వారికి ఇష్ట‌మైనవ‌న్నీ పెడ‌తారు. ఇలా త‌మ ఆప్యాయ‌త‌లు, ఆనందాల‌తో సంక్రాంతి పండుగ‌ను చేసుకుంటారు.

బంధువులు.. స్నేహితులతో..

సంక్రాంతికి స్వ‌గ్రామాల‌కు వెళ్లిన ప్ర‌జ‌లు త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. స్నేహితులు, కుటుంబ స‌భ్యులతో క‌లిసి సినిమాలు, షికార్లు, పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేశారు. ఏడాదికి ఒక‌సారి రెండు సార్లు క‌లిసే స్నేహితులు రాత్రి పూట త‌మ ఇళ్ల‌కు కూడా వెళ్ల‌కుండా అంద‌రూ ఒకేద‌గ్గ‌ర చేరి క‌బుర్లు, పార్టీలు చేసుకున్నారు.

ఆత్మీయ పలకరింపులు..

త‌మ‌త‌మ జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తుల‌ను, చేదు వార్తాల‌ను మాట్లాడుకుంటూ స‌మ‌యాన్ని గ‌డిపారు. అల్లుళ్లు, కుమారులు వాహ‌నాల‌పై ఊరంతా తిరుగ‌తూ బంధువుల‌ను ప‌ల‌క‌రించ‌డం, అమ్మ‌మ్మ‌, నానమ్మ, తాతాయ్య‌లు చిన్నారుల‌కు గారెలు, పిండి వంట‌లు తినిపించ‌డం, ఆలయాల‌కు తీసుకెళ్ల‌డం, కోడ‌ళ్లు, కూతుళ్ల క‌బుర్ల‌తో కాల‌క్షేపం చేయ‌డంతో మొబైల్ ఫోన్లు, టీవీలు మూగ‌బోయాయి.

చిన్ననాటి ముచ్చట్లు..

పిండి వంట‌లు, సామూహిక భోజ‌నాలు, కోడి పందేలు, కోస వంట‌కాలు, జాత‌ర‌లు, ప్ర‌భ‌ల ఉత్స‌వాలు, ప‌ర్యాట‌క యాత్ర‌లు, చిన్న‌నాటి స్నేహితుల‌తో ముచ్చ‌ట్లు ఇలా ఎన్నెన్నో మధురమై జ్ఞాప‌కాలు ప్ర‌తి ఒక్కరి మ‌దిలో ప‌దిల‌మ‌య్యాయి. పండుగ పూర్తి అయింది. సెల‌వుల కూడా ముగిశాయి. కుటుంబ స‌భ్యుల‌కు వీడ్కోలు చెబుతుంటే ఇరువురి గుండెలు బ‌రువెక్కాయి. రైలు, బ‌స్సు, కారు ఎక్కి వెళ్లుంటే, ఓరే నాన్న అంటూ కుమారుడిని, త‌ల్లి అంటూ కుమార్తెల‌ను పిలుస్తూ మ‌ళ్లీ ఎప్పుడొస్తార‌ని సాగ‌నంపుతూ త‌ల్లిదండ్రులు, తోబుట్టువుల‌కు చేతులూపి బైబై చెబుతుంటే కంట నీటి ధార ఒలికింది.

రాష్ట్ర నలుమూలల నుంచి..

తోబుట్టువుల‌కు అన్న‌ద‌మ్ములు త‌క్కువ రాకుండా చూసుకుంటారు. వారు ఉద్యోగం, ఉపాధి చేస్తున్న ఊళ్ల‌కు బ‌య‌లుదేరిన‌ప్పుడు వారికి పిండివంట‌లు, ఇంట్లోకి అవ‌స‌ర‌మైన స‌రుకులు త‌ల్లిదండ్రులు, అన్న‌ద‌మ్ములు క‌డ‌తారు. వారికేం కావాలో అన్ని పెట్టు అంటూ తల్లుల‌కి తండ్రులు చెబుతారు. సోద‌రికి పెట్ట‌డానికి ఇంకా ఏమైనా ఉండాలా? అంటూ అమ్మ‌ల‌ను అన్న‌ద‌మ్ములు అడుగుతారు. రాష్ట్రం న‌లుమూల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా స్వ‌గ్రామాల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు తాము ఉద్యోగాలు, ప‌నులు చేసుకునే ప్రాంతాల‌కు బ‌య‌లుదేరారు.

(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner