Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ పునరుద్ధరణ, 24 గంటల్లో మరమ్మతులు
Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రాఘవపూర్ వద్ద రైల్వే లైన్‌ను పునరుద్ధరించారు.రైల్వేశాఖ శరవేగంగా పనులు చేపట్టి రైల్వే లైన్ ను వినియోగంలోకి తెచ్చారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గం, విద్యుత్ లైన్ ధ్వంసమయింది.20 రైళ్ళు రద్దయ్యాయి.
Railway Track Restored: పెద్దపల్లి-రామగుండం రైల్వే లైన్‌ను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించడంలో రైల్వే సిబ్బంది విజయం సాధించారు. మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు లైన్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాఘవపూర్ కన్నాల మద్య మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కి భీభత్సంగా మారాయి. ప్రమాద తీవ్రతకు చైన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గంలో మూడు లైన్ లు ద్వంసమయ్యాయి. వంద మీటర్ల వరకు పట్టాలు విరిగి చెల్లాచెదురుగాపడ్డాయి.
విద్యుత్ పోల్స్ విరిగి పవర్ సప్లై కి అంతరాయం ఏర్పడింది. గూడ్స్ ప్రమాదం తో కాజీపేట బల్లార్షా మద్య రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎక్కడిక్కడే రైళ్ళు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేకు భారీగా నష్టం వాటిల్లింది. రాత్రికి రాత్రే రైల్వే అధికారులు, సిబ్బంది ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు.
24 గంటలు వెయ్యిమంది…
గూడ్స్ రైలు పట్టాలు తప్పి కాజీపేట బల్లార్షా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో రైల్వే శాఖ వాయువేగంతో మరమ్మతు పనులు చేపట్టింది. వెయ్యి మంది సిబ్బంది 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేసి ధ్వంసమైన 12 బోగీలను, విద్యుత్ స్థంభాలను భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో తొలగించారు.
రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్...ఘటన స్థలం వద్దనే ఉండి పనులు పర్యవేక్షించారు. చూస్తుండగానే వంద మీటర్లు కొత్తగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. బుదవారం రాత్రి 8 గంటలకు గూడ్స్ రైలుతో పెద్దపల్లి నుంచి రామగుండం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం ఒక ట్రాక్ వినియోగంలోకి రాగా,ధ్వంసమైన మిగతా రెండు లైన్ లను శరవేగంగా మరమ్మత్తు చేస్తున్నారు. గురువారం ఉదయం వరకు పూర్తి చేసి రైళ్ళను నడిపేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.
వన్ వే లో సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి ట్రైన్…
శరవేగంగా మరమ్మత్తు చేసిన రైల్ మార్గంలో గూడ్స్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి ఈ మార్గంలో వన్ వే లో ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాజీపేటకు రాత్రి 11 గంటలకు చేరుతుందని ప్రకటించారు. అర్ధరాత్రి 12గంటలకు పెద్దపల్లి చేరుకొనే విధంగా షెడ్యూల్ చేశారు. మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హార్షా, న్యూఢిల్లీ మీదుగా శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు జమ్ముతావికి చేరుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రమాదానికి ఓవర్ లోడే కారణమా?
రైల్వే అధికారులను పరుగులు పెట్టించిన గూడ్స్ రైలు ప్రమాదానికి ఓవర్ లోడ్ కారణమని భావిస్తున్నారు. బళ్లారి నుంచి ఘజియాబాద్ కు ఐరన్ లోడ్ తో వెళ్తున్న 44 బోగీల గూడ్స్ లింక్ ఊడిపోయి రాఘవపూర్ కన్నాల మద్య పట్టాలు తప్పింది. రైలు ఇంజన్, గార్డ్ వ్యాగన్ సేఫ్ గా ఉన్నాయి. 12 బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ప్రమాద తీవ్రతను బట్టి ఓవర్ లోడ్ తో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి కారణాలను స్పష్టంగా అధికారులు చెప్పడం లేదు.
గూడ్స్ ప్రమాదం పై విచారణ
గూడ్స్ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ప్యాసింజర్ రైలు అయితే ఏ విధంగా ఉంటుందోనని ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ప్రమాదంపై కేంద్ర రైలు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచారణకు ఆదేశించారు. ఓ వైపు విచారణ నిర్వహిస్తూనే మరో వైపు ద్వంసమైన ట్రాక్ పనులు శరవేగంగా పూర్తి చేశారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమాదం పై ఆరా తీసి అధికారులను అప్రమత్తం చేశారు. పనులు వేగవంతంగా చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. గూడ్స్ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రాణం నష్టం లేకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)