PV Ramesh Resigns : మేఘాకు పివి.రమేష్(IAS) రాజీనామా
PV Ramesh Resigns : మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి.రమేష్ మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌కు రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పివి రమేష్ రాజీనామా కలకలం రేపింది.
PV Ramesh Resigns : స్కిల్ డెవలప్‌మెంట్‌క కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని మాజీ ఐఏఎస్ అధికారి పివి.రమేష్ తప్పు పట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి కల్లం అజేయ కుమార్ రెడ్డి, ప్రేమచంద్రారెడ్డిలను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పివి.రమేష్ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ సర్వీసుల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ సంస్థకు సేవలందిస్తున్నారు. మేఘా సంస్థ విదేశాల్లో నిర్వహించే ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై పివి. రమేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ అధికారి సోమవారం పీవి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనే ప్రచారంపై పివి.రమేష్ అభ్యంతరం తెలిపారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమని, అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని, స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని అనుమానం వ్యక్తం చేవారు. నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవని, స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ కేసులోస్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానమని వారి పేర్లు ఎందుకు లేవన్నారు. సోమవారం ఆయన మీడియా ముందుకు రావాలని భావించినా ఆ తర్వాత దానిని విరమించుకున్నారు.
అదే సమయంలో మేఘా సంస్థకు రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంట్రాక్టుల నిర్వహణలో మేఘా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారకూడదనే ఉద్దేశంతోనే పివి.రమేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.