Repalle Railway Station Case : రేపల్లె రైల్వేస్టేషన్ లో గర్భిణిపై అఘాయిత్యం, దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష
Repalle Railway Station Case : గత ఏడాది.. రేపల్లె రైల్వేస్టేషన్ లో గర్భిణిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఈ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Repalle Railway Station Case : భర్త కళ్ల ముందే నాలుగు నిండు గర్భిణిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన గత ఏడాది మేలో చోటుచేసుకుంది. ఈ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022 మే ఒకటో తేదీ అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్‌లో నాలుగు నెలల గర్భిణిపై భర్త, పిల్లల ఎదుటే ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన గుంటూరు జిల్లా నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం సంచలన తీర్పు ఇచ్చారు. రేపల్లె నేతాజీనగర్‌కు చెందిన పాలుబోయిన విజయకృష్ణ (20), పాలుదురి నిఖిల్ (25)లను ఈ కేసులో నిందితులుగా నిర్థారిస్తూ... 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఏ3గా ఉన్న నిందితుడు మైనర్ కావడంతో అతడిపై తెనాలి పోక్సో కోర్టులో విచారణ కొనసాగుతోంది.
అసలేం జరిగింది?
2022 మే 1న గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. రేపల్లో రైల్వే స్టేషన్ లో గర్భిణిపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు పనులు కోసం ఈ మహిళ కుటుంబం వెళ్తోంది. ఈ క్రమంలో రాత్రి వేళ రైలు దిగి రేపల్లె రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై భర్త, పిల్లలతో కలిసి మహిళ నిద్రపోతుంది. నిద్రపోతున్న మహిళను ఫ్లాట్ ఫాం చివరకు లాక్కెళ్లిన ముగ్గురు దుర్మార్గులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో దుండగులు భర్తను కొట్టి వలస మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు నిర్థారించారు. కూలీ పనుల కోసం వచ్చిన భార్య భర్తలిద్దరూ అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వే స్టేషన్‌లో రైలుదిగి, అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోనే ప్లాట్ ఫాంపైన నిద్రపోతున్నారు. ఈ సమయంలో మద్యం మత్తులో వచ్చిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. ముగ్గురు వ్యక్తులు నిద్రిపోతున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారికి అడ్డుపడిన భర్తపై దాడిచేశారు.
భర్తను నిర్బంధించి భార్యపై అఘాయిత్యం
తనను నిర్బంధించిన వ్యక్తి నుంచి తప్పించుకున్న భర్త.. ప్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి ఎంతగా ప్రాథేయపడ్డా ఎవరూ స్పందించలేదు. ఆ భర్త రైల్వేస్టేషన్ బయటికి వెళ్లి కనిపించినవారినల్లా సాయం కోరినా ఎవరూ సాయం చేయలేదు. ప్లాట్‌ఫాంపై నిద్రిపోతున్న ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసి ఓ బిడ్డను భుజంపై ఎత్తుకుని భార్యను రక్షించుకోవటానికి పరుగున పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. అతడి పరిస్థితిని గమనించి పోలీసులు వెంటనే స్పందించి, రేపల్లె రైల్వేస్టేషన్ కు చేరుకోగా అప్పటికీ ఓ దుండగుడు మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది.