Tadepalli Road: తాడేపల్లి కరకట్ట రోడ్డుపై ఆంక్షల తొలగింపు, ఐదేళ్ల తర్వాత ప్రజల రాకపోకలకు అనుమతి
Tadepalli Road: గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్ట మార్గంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న ఆంక్షల్ని తొలగించారు. సిఎం భద్రత పేరుతో ఐదేళ్లుగా రోడ్డును పూర్తిగా మూసేసి ప్రజలకు చుక్కలు చూపించారు.

Tadepalli Road: తాడేపల్లి -రేవేంద్రపాడు మార్గంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షల్ని తొలగించారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి నివాసం పేరుతో ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు చుక్కలు చూపించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టారు. తాడేపల్లికి చెందిన వైసీపీకి చెందిన రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. జగన్ ఇంటి నిర్మాణం చేపట్టిన పక్కనే భారీ విల్లాలను నిర్మించారు.
2014లో టీడీపీ అధికారంలోకి రావడం అమరావతి ప్రాంతంలో రాజధానిగా ఎంపిక కావడంతో తాడేపల్లి, ఉండవల్లి మార్గంలో నివాసాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐదేళ్ల క్రితమే ఒక్కో విల్లా దాదాపు రూ.5-6 కోట్ల ధరకు విక్రయించారు. నటుడు కృష్ణా సోదరుడు ఆదిశేషగిరి రావు వీటిని అభివృద్ధి చేశారు. అదే ప్రాంతంలో జగన్ కూడా ఇంటిని నిర్మించుకోవడంతో ఆ ప్రాజెక్టు అంచనాలు మించిపోయింది.
ఐదేళ్లుగా జైలు జీవితం…
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. దీంతో సాధారణ ప్రజలపై ఆంక్షలు మొదలయ్యాయి. జగన్ ఇంటి నిర్మాణానికి ముందే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి భద్రత పేరుతో పోలీసుల ఆంక్షలతో వారిపై ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి నివాసం వైపు ఉండే కిటికీలు కూడా తెరవడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లక్షలు పోసి కొనుక్కున్న ఇళ్లలో ఐదేళ్లుగా స్థానికులు జైలు జీవితం అనుభవించారు.
తాడేపల్లి మండలంలో ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు ఈ మార్గమే ప్రధాన రహదారిగా ఉండేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్ని విజయవాడ మార్కెట్లకు తరలించడానికి దగ్గరి మార్గంగా ఉపయోగపడేది. కరకట్టపై ఉన్న మార్గానికి ఇరువైపులా ఇళ్లు ఉండగా, జగన్ ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేకంగా మరో మార్గం ఉండేది. ఆ తర్వాత ఇళ్లు తొలగించి నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. అవతల వైపు ఉన్న కరకట్ట రోడ్డును నిరుపయోగంగా మార్చేశారు.
జగన్ ఇంటికి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నుంచి ఆయన ఇంట్లోకి చేరుకోవచ్చు. మరో మార్గంలో బకింగ్ హామ్ కెనాల్ ఒడ్డున పేదల ఇళ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఉండవల్లి నుంచి రేవేంద్రపాడు వరకు బకింగ్ హామ్ కెనాల్ వెళ్లే మార్గంలో జగన్ నివారం కరకట్ట ఒడ్డున ఉంటుంది. తాడేపల్లి-ఉండవల్లి-నేషనల్ హైవేలకు వెళ్లే జంక్షన్ నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున రోడ్డును ఐదేళ్లుగా మూసేశారు.
ఈ మార్గంలో కరకట్టపై నివాసం ఉంటున్న ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించారు. జాతీయ రహదారి మీదుగా ట్రాఫిక్‌లో చిక్కకుండా ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని సిఆర్‌డిఏ గతంలోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారి పోవడంతో ప్రాధాన్యతలు మారిపోయాయి. రోడ్డు విస్తరణ చేపట్టినా అది ముఖ్యమంత్రికి మాత్రమే అందుబాటులో ఉంచారు. రోడ్డుకు రెండువైపులా బారికేడ్లు పెట్టి ప్రజల రాకపోకల్ని నియంత్రించారు. కరకట్టపై ఉన్న ఇళ్లను తొలగించి కట్ట కింద నాలుగు వరుసల రోడ్డును నిర్మించారు.
రహదారి నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న భరత మాత విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించింది. కరకట్ట వెంట నివాసం అమరానగర్‌లో ఉన్న పేదల ఇళ్లు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పవన్ కళ్యాణ్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో వారిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సిఎం ఇంటికి వెళ్లే మార్గంలో రోడ్డుకు కోట్ల ఖర్చుతో ఇరువైపులా లాండ్ స్కేపింగ్, లైటింగ్ ఏర్పాటు చేశారు.
జగన్ భద్రత పేరుతో మూసివేసిన రోడ్డును తెరవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట మార్గంలో రాకపోకలపై ఆంక్షలు సడలించాలని స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సిఎంఓ స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం అధికంగా ఉండే తాడేపల్లి ప్రాంతంలో కూడా నారా లోకేష్‌కు భారీ మెజార్టీ దక్కడానికి ఈ ఆంక్షలు, వేధింపులు స్థానికులపై తీవ్ర ప్రభావం చూపించాయి.
ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వస్తే స్థానికులు బయటకు రావడానికి వీల్లేదనే ఆదేశించేవారు. దుకాణాలు మూతబడేవి. సిఎం బయటకు వెళ్ళి, తిరిగి వచ్చే వరకు వ్యాపారాలు మూతబడి ఉండాల్సి వచ్చేది. తాము ఏరికోరి ఎన్నుకుంటే తమనే వేధిస్తున్నాడనే భావనతో ఐదేళ్లుగా తాడేపల్లి ప్రజలు రగిలిపోయారు. తాజాగా ఆంక్షలు సడలించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం