Ysr Kalyanamastu: నాలుగో విడత వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
Ysr Kalyanamastu: పేద కుటుంబాలకు పెళ్లిళ్లు భారంగా మారకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్ షాదీతోఫా, కళ్యాణమస్తు పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు.
Ysr Kalyanamastu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ షాదీతోఫా, వైఎస్సార్ కళ్యాణ మస్తు నిధులను ముఖ్యమంత్రి లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేశారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులకు ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్ధిక ప్రయోజనాలను కల్పించారు. 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు అందించినట్టు సిఎం చెప్పారు.
2022 అక్టోబర్ నుంచి ప్రారంభించి ఇప్పటికి మూడు విడతలు చెల్లించామని, ఇప్పటి వరకు 46062 జంటలకు రూ. 349కోట్లను జమ చేసినట్టు చెప్పారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో పరిస్థితిని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు.
ప్రజలకు ఉపయోగపడేలా గత ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో పథకాలను తీసుకురాలేదన్నారు. ఒక పథకానికి మంచి ఉద్దేశం సంకల్పం ఉండాలని, అలా ఉంటే దానిని చేయడానికి అన్ని రకాల పరిస్థితులు కలిసి వస్తాయన్నారు.
మంచి సంకల్పంతో అడుగులు వేశామన్నారు. పదో తరగతి సర్టిఫికెట్, 18-21 సంవత్సరాలకు పట్టుబట్టడం ఎందుకని తనను ప్రశ్నించారని, ఓట్లు, ఎన్నికలు ప్రాధాన్యత కాదని మంచి సంకల్పం, దూరదృష్టితో అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఆ నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 18ఏళ్లు వధువుకు, వరుడికి ఉండాలనే నిబంధన ఉంటే బాల్య వివాహాలు తగ్గిపోతాయని, ప్రతి కుటుంబ పిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తారన్నారు.
పదో తరగతి, ఇంటర్ వరకు విద్యార్ధులకు అమ్మఒడి అందిస్తున్నామని ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన అందుబాటులో ఉండటం వల్ల పిల్లలు పేదరికం నుంచి బయటపడి ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు ఉంటాయన్నారు. 2018ముందు పదో తరగతి నిబంధన లేదని, ఆ తర్వాత పథకాన్ని రద్దు చేశారని సిఎం జగన్ చెప్పారు.
గత ప్రభుత్వ హయంలో చిత్తశుద్ధి లేకుండా పథకాన్ని అమలు చేశారని, తాము ప్రతి ఒక్కరికి మంచి చేసేలా ప్రతి త్రైమాసికం పూర్తైన వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో మైనార్టీలకు రూ.50వేలు మాత్రమే ఇచ్చేవారని ఇప్పుడు లక్ష రుపాయలు షాదీతోఫా చెల్లిస్తున్నట్లు వివరించారు.
వికలాంగులకు లక్షన్నర చెల్లిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రుపాయలు చెల్లిస్తున్నామన్నారు. గతంలో 40వేలు మాత్రమే చెల్లిస్తున్నామన్నారు. కులాంతర వివాహాలకు లక్షా 20వేల రుపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. పిల్లల్ని చదివించడానికి ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
నాలుగో విడతలో షాదీతోఫా, కళ్యాణమస్తు అందుకుంటున్న 10511మందిలో 8042మందికి అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా ప్రయోజనాలు అందుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.