Lands Regularization: ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్, అభ్యంతరం లేని ఆక్రమణలకు అమోదం-regularization of government land encroachments approved in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lands Regularization: ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్, అభ్యంతరం లేని ఆక్రమణలకు అమోదం

Lands Regularization: ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్, అభ్యంతరం లేని ఆక్రమణలకు అమోదం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 30, 2025 10:36 AM IST

Lands Regularization: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అభ్యంతరం లేని స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వాటిని క్రమబద్దీకరించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఈ మేరకు క్రమబద్దీకరిస్తారు.

ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు
ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు

Lands Regularization:ఆంధ్రప్రదేశ్‌లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు విధివిధానాలు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆక్రమిత భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వాటిని క్రమబద్దీకరిస్తారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

yearly horoscope entry point

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణ కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు ఖరారు చేశారు.

ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నిటిని రద్దు చేసి తాజాగా జీవో నెంబర్ 30 ప్రభుత్వం జారీ చేసింది. 2019 అక్టోబర్ 15 తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. 2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుంది.

మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరుల కు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలుగా ఉన్నా, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణకు అనర్హులుగా పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేశారు.

150 గజాల వరకూ ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నారు. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణ లో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువ తో నే క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈమేరకు ఉరెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా త్తర్వులు జారీ చేశారు.

ఆదాయపన్ను చెల్లింపుదారులకు క్రమబద్దీకరణ వర్తించదు. లబ్దిదారులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్న టాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపు ఇస్తామని పేర్కొంది. గత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు ఆక్రమణల క్రమబద్ధీకరణపై రెవెన్యూ శాఖ బుధవారం 30 జీఓను జారీచేసింది. లబ్ధి దారులకు పట్టా, కన్వేయన్స్ డీడ్ అందజేసిన రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసేవారికి గరిష్ఠంగా గ్రామాల్లో నెలకు రూ.10,000, పట్టణాల్లో నెలకు రూ. 14,000 ఆదాయం ఉండాలి. నెలకు రూ.300లోగా విద్యుత్తు ఛార్జీల చెల్లింపు ఉండాలి. మెట్ట, మాగాణి కింద 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. క్రమబద్ధీకరణకు రిజిస్టర్డ్ డాక్యు మెంట్, ఆస్తిపన్ను విద్యుత్తు బిల్లు, వాటర్ చెల్లింపు, బిల్లులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్సీసీ, ఆస్బెస్టాస్‌ రేకులతో నిర్మించిన ఇళ్లు ఉండాలి.

డిసెంబరు 31వరకు దరఖాస్తులు

తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ/వార్డు సిబ్బంది ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించాలి. అర్హత కలిగిన లబ్దిదారుల జాబితాను గ్రామ/వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్‌ కలెక్టర్, ఆర్డీఓలకు పంపాలి. ఇప్పటికే పెండింగులో ఉన్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకోవాలి.

కొత్త దరఖాస్తులను డిసెంబరు 31వ తేదీ వరకు స్వీకరించాలి. సబ్ డివిజన్ లెవెల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్‌కు 30 రోజు ల్లోగా అప్పీలు చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్లదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్-రిజిస్ట్రార్లు, జిల్లా రిజి స్ట్రార్లకు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Whats_app_banner