RGUKT IIIT: ట్రిపుల్ ఐటీ రెండో విడత కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేష‌న్ ప్రారంభం, జూలై 30వరకు అవకాశం-registration for triple it 2nd phase counseling till 30th july ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rgukt Iiit: ట్రిపుల్ ఐటీ రెండో విడత కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేష‌న్ ప్రారంభం, జూలై 30వరకు అవకాశం

RGUKT IIIT: ట్రిపుల్ ఐటీ రెండో విడత కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేష‌న్ ప్రారంభం, జూలై 30వరకు అవకాశం

HT Telugu Desk HT Telugu

RGUKT IIIT: ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల్లో భాగంగా రెండో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. జూలై 30వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఏపీ ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్

RGUKT IIIT: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాల‌యం (ఆర్జీయూకేటీ) ప‌రిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో రెండో విడ‌త‌ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్రారంభం అయింది. జూలై 30తో గ‌డువు ముగియ‌నుంది.

రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాల‌యం (ఆర్జీయూకేటీ) ప‌రిధిలోని నూజివీడు, ఇడుపుల‌పాయ‌, ఒంగోలు, శ్రీ‌కాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు తొలి విడ‌త కౌన్సిలింగ్ ప్ర‌క్రియ పూర్తి అయింది. మొత్తం 4,140 మంది కౌన్సిలింగ్‌ల‌కు పిల‌వ‌గా, వారిలో 3,396 మంది ప్ర‌వేశాలు పొందారు.

రాష్ట్రంలో ఉన్న‌నూజివీడు, ఇడుపుల‌పాయ‌, ఒంగోలు, శ్రీ‌కాకుళం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ట్రిపుల్ ఐటీల్లో 4,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈడ‌బ్ల్యూఎస్ కోటా కింద ఒక్కో ట్రిపుల్ ఐటీకి 100 సీట్లు చొప్పున‌, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 400 సీట్లు ఉన్నాయి. దీంతో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో 85 శాతం సీట్లు రాష్ట్రంలోని విద్యార్థుల‌కు మాత్ర‌మే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్ల‌లో రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల‌కు కూడా పోటీ ప‌డ‌వ‌చ్చు. ఈ సీట్ల‌ను ఏపి, తెలంగాణ విద్యార్థుల‌కు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ఇందులో ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనున‌క‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు 100 సీట్లు కేటాయిస్తారు. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు 25 శాతం సూప‌ర్ న్యూమ‌రీ సీట్లు అందుబాటులో ఉంటాయి.

అయితే 4,400 సీట్ల‌లో 3,396 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 1,004 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మిగిలిన సీట్ల‌ను రెండో విడ‌త కౌన్సిలింగ్ ద్వారా భ‌ర్తీ చేస్తారు. జులై 30 వ‌ర‌కు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు ఆర్జీయూకేటీ అవ‌కాశం ఇచ్చింది. వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://admissions24.rgukt.in/ind/preferencesnr లో ద‌ర‌ఖాస్తును జులై 30న సాయంత్రం 6 గంట‌ల లోపు చేసుకోవ‌చ్చు. అలాగే మొద‌టి విడ‌త‌లో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంప‌స్‌ల‌ను కూడా మార్పు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://admissions24.rgukt.in/ind/preferences లో ద‌ర‌ఖాస్తును జులై 30న సాయంత్రం 6 గంట‌ల లోపు చేసుకోవ‌చ్చు.

మొద‌టి విడ‌తలో సీట్లు పొందిన అభ్య‌ర్థులు క్యాంప‌స్‌ల‌కు వెళ్లి రిపోర్టు చేయ‌ని అభ్య‌ర్థులకు జులై 30లోగా రెండో విడ‌త కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేష‌న్ అవ‌కాశం క‌ల్పించింది. కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావాల్సిన వారి జాబితా ఆగ‌స్టు 3న వెల్ల‌డిస్తారు. ట్రిపుల్ ఐటీల్లో రెండో విడ‌త కౌన్సిలింగ్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్‌ https://admissions24.rgukt.in/ind/home ను సంప్ర‌దించొచ్చు.

రిజ‌ర్వేష‌న్ల అమ‌లు ఇలా

ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను ఇలా అమ‌లు చేస్తారు. ఎస్‌సీల‌కు 15 శాతం, ఎస్‌టీల‌కు 6 శాతం, బీసీల‌కు 29 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తారు. బీసీల్లో 29 శాతంలో కూడా బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశారు.

విక‌లాంగుల‌కు 5 శాతం, సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థుల‌కు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్ల‌ను కేటాయిస్తారు. అలాగే ప్ర‌తి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్ల‌ను బాలిక‌ల‌కు కేటాయిస్తారు.

కోర్సులు

పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ క‌లిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్య‌సించ‌వ‌చ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సుల‌తో స‌మానంగా మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్ సైన్స్ ప్ర‌త్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, సివిల్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ బ్రాంచ్‌లు ఉంటాయి.

ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థుల‌కు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూష‌న్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు ఉంటుంది. బీటెక్ విద్య‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.50 వేలు ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.1.50 ల‌క్ష‌లు ఉంటుంది.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)