శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనాలు - లెక్కలివే-record number of devotees visit tirumala on fridays ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనాలు - లెక్కలివే

శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనాలు - లెక్కలివే

వేసవి సెలవుల వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా మే 15 నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే, జూన్‌లలోని ప్రతి శుక్రవారం గతంలో కన్నా సుమారు 10 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది.

తిరుమల

వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. గత మే నెల 15 వ తేదీ నుంచి మరీ విపరీతంగా పెరిగింది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.

అదనంగా దర్శనాలు…!

శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ లో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే. జూన్ మాసాలలోని శుక్రవారాలలో ఎక్కవ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

దర్శన గుణాంకాలు పరిశీలిస్తే…. శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

భక్తులకు టీటీడీ కీలక సూచనలు:

తిరుమల శ్రీవారి దర్శనానికి వాహనాల్లో వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డులో బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.

  • శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ తెలిపింది.
  • నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని వెల్లడించింది.
  • భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని కోరింది.
  • మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
  • భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టినట్లు వెల్లడించింది.
  • భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుంచి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
  • మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టీటీడీలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.