Rayanapadu Railway Station : రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. మరిన్ని రైళ్లు ఆగే అవకాశం
Rayanapadu Railway Station : రాయనపాడు రైల్వే స్టేషన్.. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోలేదు. బెజవాడ పక్కనే ఉన్నా.. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయలేదు. రాయనపాడును డెవలప్ చేస్తే.. విజయవాడలో రద్దీ తగ్గుతుంది. అయినా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. తాజాగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్‌కు కొత్తరూపు రానుంది. ఇన్నాళ్లు ఈ స్టేషన్ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. ఎట్టకేలకు స్టేషన్ అభివృద్ధిపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. గతంలో శాటిలైట్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అమృత్ భారత్ స్టేషన్ పేరుతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు.
అత్యాధునిక సౌకర్యాలతో..
అత్యాధునిక సౌకర్యాలతో రాయనపాడు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో అరకొరగా ఆగే రైళ్లు ఇప్పుడు ఎక్కువగా ఆగనున్నాయ్. రూ.12.13 కోట్ల నిధులతో ప్లాట్‌ఫాంల నిర్మాణం, ప్రయాణికులు వేచి ఉండేలా వెయిటింగ్ హాల్, టికెట్లు ఇచ్చే కేంద్రం, స్టేషన్ మాస్టర్ గది తదితర అభివృద్ధి గదులు నిర్మిస్తున్నారు. ప్రయాణికులు కూర్చునేలా బల్లలు, ఫ్లోరింగ్, పచ్చదనం కోసం మొక్కలు నాటడం లాంటి పనులు చేపట్టనున్నారు.
మరిన్ని రైళ్లు ఆగేందుకు..
ఒకప్పుడు ఇవేమీ లేక ఎక్కువ ప్రజలు నానా అవస్థలు పడేవారు. రైళ్లు సైతం ఆగేవి కాదు..ప్రస్తుతం స్టేషన్ అత్యాధునికంగా తీర్చిదిద్దేలా పనుల చేస్తున్నారు. దీంతో రైల్వేస్టేషన్‌లో మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. ఈ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బెజవాడపై ఒత్తిడి తగ్గే అవకాశం..
రాయనపాడు రైల్వేస్టేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే.. మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుంటాయి. అదే సమీపంలో ఉన్న రాయనపాడులో పనులు పూర్తయితే.. మరికొన్ని రైళ్లు ఆగేందుకు వీలుంటుంది. విజయవాడ స్టేషన్‌లోకి రైళ్లు వెళ్లకుండానే శివారులో ఆగి వెళ్లవచ్చు.
ఆర్టీసీ బస్సులు..
వాస్తవానికి విశాఖపట్నం వైపు వెళ్లేందుకు, అటు వైపు నుంచి వచ్చే రైళ్లు విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండానే.. రాయనపాడు రైల్వేస్టేషన్‌కు వచ్చే విధంగా ట్రాక్‌ల నిర్మాణం ఉంది. కానీ ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మూడు, నాలుగు రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. అదే పనులు పూర్తయితే మరికొన్ని ఆగేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికులు రైలు దిగినా ఆ సమయానికి విజయవాడ నగరంలోకి చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.