AP Govt : తుది దశకు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్.. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే!
AP Govt : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలతో.. ప్రభుత్వం భేటీ కానుంది. అయితే.. ప్రమోషన్ ఛానల్‌పై స్పష్టత ఉండాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. అంతకంటే ముందే ఈనెల 17న ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు.
మూడు కేటగిరీలుగా..
ఈ భేటీలో ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశంపై తుది నివేదికను.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది.
సిబ్బంది కుదింపు..
మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా ప్రభుత్వం విభజించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయా (11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు)ల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు. ఆ మేరకు సచివాలయ సిబ్బందిని కుదించనున్నారు.
ఇతర శాఖల్లో సర్దుబాటు..
2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి (ఏ కేటగిరీ) ఆరుగురు, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి (బీ కేటగిరీ) ఏడుగురు, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయానికి (సీ కేటగిరీ) ఎనిమిది మంది కేటాయించారు. ఇలా ఉద్యోగులను విభజించడంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలారు. వీరిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది.
ఇప్పటికే సమాలోచనలు..
మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే అంశంపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఫోకస్ పెట్టారు. ఇంజనీరింగ్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు, వాటిల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్..
అయితే ఉద్యోగ సంఘాలు తమ ప్రమోషన్ ఛానల్‌పై డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ సర్వేయర్లు యూనియన్ ఒక అడుగు ముందుకేసి.. ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా? అనే అంశంపై ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహిస్తోంది. గ్రామ సర్వేయర్లుగా ఉంటూనే టెక్నికల్ హోదా ఇస్తూ ప్రమోషన్ ఛానల్ ఇస్తే బాగుంటుందా? లేకపోతే ఇతర డిపార్టుమెంట్‌ల్లోకి వెళితే బాగుంటుందా? అనే విషయంపై లోతుగా సంఘాల సభ్యులతో చర్చిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)