ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు తిరిగి నూతన జవసత్వాలు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ దుకాణాలు ఇప్పుడు నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా మొదలైంది. రేషన్ దుకాణాలు పునః ప్రారంభించడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం కేవలం ప్రజలకు సంతోషం కలిగించడమే కాకుండా, గత ప్రభుత్వం చేసిన అనవసర వ్యయాన్ని తగ్గించగలిగింది.
ప్రముఖ రీసెర్చ్ సంస్థ, పీపుల్స్ పల్స్ కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ప్రజలు ‘‘మాకు రేషన్ షాపులే మేలు, మళ్లీ పాత విధానాన్ని అమలు చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్- ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ పద్ధతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ప్రజలు తమకు అనుకూల సమయంలో, సౌకర్యంగా రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడమే మెరుగైనదని ఈ సర్వేలో అభిప్రాయపడటం, ప్రజల అభిప్రాయానికి అద్దం పడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ. 1,650 కోట్ల ప్రజా ధనాన్ని ఎండీయూ వాహనాల కొనుగోలుకు ఖర్చు చేసింది. 9,260 ఎండీయూ వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ, అవి ప్రజలకు మేలు చేయకపోగా, రేషన్ మాఫియా, అక్రమ రవాణాకు ఆజ్యం పోశాయి. ఈ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియక, ప్రజలు పని మానుకుని ఇంట్లో ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాస్తవానికి, ఈ వాహనాలతో ‘‘డోర్ డెలివరీ’’ చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గొప్పలు చెప్పినప్పటికీ... ఆ వాహనం ఏ వీధి చివరో ఆగి సరుకులు ఇచ్చి వెళ్లిపోయేది. దీంతో అది ‘‘స్ట్రీట్ డెలివరీ’’గా మారి కనీసం వారు అనుకున్న ప్రయోజనాలు కూడా నెరవేరలేదు. ఈ వాహనాల వల్ల ప్రజలకు అసౌకర్యం తప్ప ఎలాంటి ప్రయోజనం కలగలేదు.
ప్రజల అభిప్రాయాలను పరిగనణలోకి తీసుకుని ప్రస్తుత ప్రభుత్వం రేషన్ షాపులను పునఃప్రారంభించి, ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా, సమర్థంగా సేవలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి 8 వరకు, ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రజలకు అనుకూలంగా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా వారి పనులకు అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నారు.
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 5వ తేదీలోపు వారి ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయాలని నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వం మానవతా విలువలకు పెద్దపీట వేసింది. ఉదాహరణకు, కాకినాడ జిల్లా వాకలపూడిలో కృష్ణంశెట్టి గోపాల్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరకులు అందించిన సందర్భం ప్రభుత్వ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచింది. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, రేషన్ డెలివరీ అయిన వెంటనే ఫోటో అప్లోడ్ చేసే విధంగా, పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చింది.
ఈ-పోస్, వేయింగ్ మెషీన్లు, సీసీ కెమెరాలు, ఫిర్యాదు కోసం క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులకు ఏదైనా సమస్య ఎదురైతే, షాపు వద్దే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రేషన్ పంపిణీ వివరాల కోసం ప్రత్యేక యాప్ రూపొందించి, ప్రతి లావాదేవీని నమోదు చేస్తున్నారు. ఒకప్పుడు ఎండీయూ వాహనాలే రేషన్ మాఫీయాకు కేంద్రంగా ఉండేవి. వారు, రేషన్ బియ్యాన్ని ఆ వాహనాల్లో తీసుకెళ్లి దళారులకు అమ్మేవారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ రేషన్ మాఫియాకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరు పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, బియ్యం స్మగ్లింగుకు అడ్డుకట్ట వేసింది. ప్రజలకు అందాల్సిన రేషన్ ఎక్కడా దారి తప్పకుండా చర్యలు తీసుకుంటోంది.
గతంలో ఇంటింటికీ రేషన్ పేరిట దాదాపు రూ. 1,700 కోట్ల ప్రజా ధనం ఖర్చయింది. ఇప్పుడు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం వల్ల రూ. 768 కోట్ల ఆదా అవుతోంది. ఇది కూటమి ప్రభుత్వ సమర్థతను, ప్రజా ధన సంరక్షణకు కట్టుబడ్డ తీరును స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. చౌక ధరల దుకాణాలుగా ప్రారంభమైన ప్రజా పంపిణీ వ్యవస్థ కాలక్రమేణా ఉచిత బియ్యం పంపిణీగా మారిపోయింది. దీంతో నిత్యవసరాల ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్లకు అవసరమైన నిత్యావసరాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ వలే అభివృద్ధి చేయాలని సంకల్పించింది. బియ్యం మాత్రమే కాకుండా, మిల్లెట్లు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను, ఇతర నిత్యవసరాలను అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రజారోగ్య పరిరక్షణకు, పోషకాహార భద్రతకు దోహదపడుతుంది.
గత ప్రభుత్వం రేషన్ డీలర్లను వేధించిన తీరును ప్రతి ఒక్కరూ చూశారు. కొత్త ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల లబ్దిదారుకు, డీలర్లకు మధ్య సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. మొత్తంగా చూస్తే రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, ప్రజలకు చేరువగా సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది.
ఆర్థికంగా బలహీన వర్గాలకు సరసమైన ధరల్లో ఆహార ధాన్యాలను, నిత్యవసరాలను అందించి, ఆహార భద్రతను కల్పించటం, ధరల పెంపు నుంచి ప్రజలకు ఉపశమనం కలింగిచడం, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆహార ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, ప్రజలు ఆరోగ్యానికి అనుగుణంగా అవసరమైన కనీస పోషకాహార స్థాయిని నిర్వహించడం వంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధాన లక్ష్యాలను నెరవేర్చాడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రజా ధన దుర్వినియోగాన్ని అరికట్టి, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందిన ఈ సంస్కరణ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి మార్గాలకు దారి చూపుతుంది.
-జి.మురళీ కృష్ణ,
సామాజిక విశ్లేషకులు
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు.)
టాపిక్