Perni Nani : రేషన్ బియ్యం కేసులో ఏ6గా పేర్ని నాని, అప్పటి వరకూ అరెస్టు చేయొద్దన్న హైకోర్టు
Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు మచిలీపట్నం పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తాజాగా పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది.
Perni Nani : రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం వ్యవహారం లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పేర్ని నానిపై తొందర పాటు చర్యలొద్దని, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది.
రేషన్ బియ్యం మాయం కేసులో దూకుడు పెంచిన పోలీసులు...ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ ఏ1గా ఉన్నారు. కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టైన నలుగురు నిందితులు గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి పేర్ని నానిని ఏ6గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యం మాయం
వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట గోదామును నిర్మించారు. దీనిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఈ గోదాములో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసింది పౌరసరఫరాల శాఖ. ఈ రేషన్ నిల్వల్లో అవకతవకలను గుర్తించిన అధికారులు...ఇటీవల గోదాములో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు తనిఖీల్లో నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...గోదాము మేనేజర్ మానస్‌తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి, మరో ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు మానస్ తేజ ఖాతా నుంచి డబ్బులు వెళ్లినట్లు గుర్తించారు.
పేర్ని నానికి హైకోర్టులో ఊరట
ఈ కేసు విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ...పేర్ని జయసుధకు సోమవారం నోటీసులు జారీ చేశారు. పేర్ని జయసుధకు చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయంపై విచారణ చేపట్టిన ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులు 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ వచ్చినట్లు గుర్తించారు. ఇందుకు పేర్ని నాని రూ.1.68 కోట్ల జరిమానా చెల్లించారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పౌరసరఫరాల అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా విధించాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని పేర్ని జయసుధకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు ఇచ్చారు.
సంబంధిత కథనం