ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, కార్డుల్లో మార్పులు చేర్పులకు ఎలాంటి గడువు లేదని.. అర్హత ఉన్న వారు రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి నాదెండ్ల తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు అందిస్తామని చెప్పారు.
కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదని దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నామని ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. గత రెండేళ్ల నుంచి కొత్త కార్డులు జారీ కాలేదు. కార్డులకు ఈకెవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేసినట్టు వివరించారు.
దేశంలో 95శాతం ఈకేవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఏపీలో 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యిందని 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తి కాలేదన్నారు. కొత్త కార్డుల కోసం అనేక మంది అప్లికేషన్లు ఇస్తుండటంతో సర్వర్ స్లో కావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయని అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారని ఉన్న కార్డు నుంచి తొలగింపు కోసం 44వేల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి చెప్పారు అడ్రస్ మార్పులు కోసం 12,500 మంది ధరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశారని, గత పదిహేను రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ పూర్తి చేసుకున్న 4,24,59,128 మందికి జూన్ నెలలోఉచితంగా రైస్ కార్డులను అందజేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందొద్దని.. మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తాం అని మంత్రి వివరించారు.
కొత్త కార్డులకు మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదని, పెళ్లికి సంబంధించి ఫొటో కూడా అక్కర్లేదని రైస్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు.
పెళ్లి సంబంధించి పొటో కూడా అక్కర్లేదని వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నారని, అలా చేయొద్దని ఆదేశించారు.
కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే నమోదు చేయాలని సూచించారు. ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని పేరు తొలగింపు సంబంధించి డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామన్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారి రేషన్ కార్డులపై సరైన కారణం ఉంటే డిలీట్ చేసేందుకు ఆప్షన్ ఇస్తున్నాం. మహిళలు, స్త్రీలుతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డుల అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఈకేవైసీ, ఆధార్ సీడింగ్ లో మార్పులు, రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సప్ ద్వారా చేసుకునేలా విధంగా సేవలు అందిస్తామన్నారు.
60ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇకపై రేషన్ దుకాణాల నుంచి నేరుగా రేషన్ అందిస్తామని మంత్రి నాదెండ్ల చెప్పారు. ఇంటింటి రేషన్ పంపిణీపై ఆందోళన చెందొద్దని అవసరమైన వారికి ఇంటికి రేషన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
సంబంధిత కథనం