Tirumala : ఫిబ్రవరి 4న తిరుమలలో రథసప్తమి - ఒకేరోజు ఏడు వాహన సేవలు, భక్తులకు టీటీడీ కీలక సూచనలు
Ratha Saptami in Tirumala 2025: ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమీక్షించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి వేడుకలు జరుగుతాయని తెలిపారు.

టీటీడీ ఈవో సమీక్ష - కీలక సూచనలు
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఈవో శ్యామలరావు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు.
గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
వాహన సేవల వివరాలు:
- ఉదయం 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
- ఉదయం 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
- సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
ప్రివిలేజ్ దర్శనాలు రద్దు :
రథసప్తమి సందర్భంగా ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాకుండా ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని టీటీడీ భక్తులను కోరింది.
సంబంధిత కథనం