TTD Rathasaptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి, సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం-ratha saptami celebrated grandly in tirumala sri malayappa swamy blesses devotees on surya prabha vahanam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Rathasaptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి, సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

TTD Rathasaptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి, సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

Bolleddu Sarath Chandra HT Telugu
Feb 04, 2025 08:44 AM IST

TTD Rathasaptami: సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథ సప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఉదయం 6.48 సూర్యకిరణాలు శ్రీవారి పాదాలను తాకాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

TTD Rathasaptami: ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడంతో ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

yearly horoscope entry point

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.

సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) :

రథసప్తమి వేళ అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.

ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

ఆయురారోగ్య‌ప్రాప్తి :

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభగా భావిస్తారు.

సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే కావడంతో సూర్యుడిని సూర్యనారాయణుడిగా కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

రథ సప్తమి వేడుకల్లో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,భాను ప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Whats_app_banner