Sri Gadi Bapanamma Temple : వెదురు పొద‌ల్లో వెలసిన సీతపల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ, కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి-rampachodavaram sri gadi bapanamma temple devotees visit temple history ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sri Gadi Bapanamma Temple : వెదురు పొద‌ల్లో వెలసిన సీతపల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ, కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి

Sri Gadi Bapanamma Temple : వెదురు పొద‌ల్లో వెలసిన సీతపల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ, కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి

HT Telugu Desk HT Telugu
Oct 06, 2024 09:07 PM IST

Sri Gadi Bapanamma Temple : వెదురు పొదల్లో వెలిసి శ్రీ గడి బాపనమ్మ కోర్కెలు తీర్చే కల్పవల్లి అని స్థానికులు భావిస్తారు. రంపచోడవరం మండలం సీతపల్లిలో కొలువై ఉన్న అమ్మవారి దర్శనానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దగ్గరకు చెప్పులతో వెళ్తే మైకం కమ్మినట్లు ఉంటుందని భక్తుల నమ్మకం.

వెదురు పొద‌ల్లో వెలసిన సీతపల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ, కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి
వెదురు పొద‌ల్లో వెలసిన సీతపల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ, కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి

చుట్టూ ద‌ట్టమైన అడ‌వి, అందులోనూ వెదురు పొద‌లు ఆ మ‌ధ్యలోనే కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ అమ్మవారి గుడి ఉంటుంది. వెదురు పొదల్లో వెలిసిన గ‌డి బాప‌న‌మ్మ అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రజ‌లు ప‌రిత‌పిస్తారు. మాతృశ్రీ గడి బాపనమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఉగాది స‌మయంలో ఐదు రోజుల పాటు జ‌రుగుతాయి.

శ్రీ‌గడి బాప‌న‌మ్మ అమ్మవారు అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారి దగ్గరకు ఎవరైనా కాలి చెప్పులు తీయకుండా వెళితే ముఖం తిరిగినట్లు ఉంటుందని, మొక్కులు మొక్కిన వాళ్లు తీర్చక పోతే వాళ్లకు మైకం కమ్మినట్లు అనిపిస్తుంది అని భక్తుల నమ్మకం.

రామాయణం కాలంలో రాముడు, సీతాదేవి వనవాసం చేసే సమయంలో క్షణకాలం ఇక్కడ సేద తీరారని, అందువలన ఈ గ్రామానికి సీతపల్లి అని పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో అనపర్తి, ఇప్పనప్పాడు, పరిసర ప్రాంతాల్లో ప్రజలు గోవులను మేపుట కోసం ఏజెన్సీ ప్రాంతానికి తరలి వచ్చినపుడు ఆ గోవులతో అమ్మవారు కూడా వచ్చి ఈ ప్రశాంత వాతావరణం నచ్చి సేదదీరి తిరిగి వెళ్లకుండా ఉండి పోయారని అప్పటి నుంచి గ్రామదేవతగా పూజలు చేసుకుంటున్నారని చెబుతారు.

1970-71 సంవత్సరంలో ఆలయ తొలి నిర్మాణం జరిగిందని వెదురు పొదలలో ఉన్న అమ్మవారిని స్వయంభూగా తలుస్తూ పూజలు జరుపుతున్నారు. పూర్వ కాలంలో అన‌ప‌ర్తి గ్రామంలో ఒక కుటుంబంలో జ‌న్మించిన బాప‌న‌మ్మ అనే అమ్మాయికి యుక్త వ‌య‌స‌సు వ‌చ్చాక వివాహం చేయ‌డానికి త‌ల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసే స‌మ‌యంలో పెళ్లివారు వ‌చ్చిన త‌రువాత పెళ్లి వ‌ద్దని నేను దేవ‌త‌ను అవుతాన‌ని (గిరిజ‌న ప్రాంతంలో సీత‌ప‌ల్లి) ప‌రిస‌ర ప్రాంతంలో ఉన్న అడ‌వుల‌లోకి గోవుల‌ను మేప‌టానికి వ‌చ్చింది.

అనంత‌రం త‌ల్లిదండ్రుల‌కు క‌ల‌లో క‌నిపించి సీత‌ప‌ల్లి గ్రామం శివారులో వెదురు పొద‌ల‌లో ప్రతిమ‌నై ఉన్నాన‌ని కుమార్తె చెప్పార‌ని చ‌రిత్ర చెబుతోంది. త‌ల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూడ‌గా, వెదురు పొద‌ల‌లో ప‌సుపు, కుంకుమ చ‌ల్లి ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడ ఉన్న ప్రతిమ‌ని శ్రీ‌గ‌డిబాప‌న‌మ్మ అమ్మవారిగా పూజించ‌టం జ‌రుగుతుంది. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు భ‌క్తులు కోరిన కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లిగా విరాజిల్లుతూ పూజ‌లు అందుకుంటున్న ఆదిశ‌క్తి సీత‌ప‌ల్లి శ్రీ‌గుడి బాప‌నమ్మ అమ్మవారు అని స్థానికులు చెబుతున్నారు.

తొమ్మిది శుక్రవారాలు శ్రీ గ‌డి బాప‌న‌మ్మ అమ్మవారి ద‌ర్శనం చేసుకుంటే శుభం జ‌రుగుతుంద‌ని ప్రజ‌ల న‌మ్మకం. ప్రతిరోజూ కుంకుమ పూజ‌, ప్రతీ వారం చండీ హోమం ఇలా అనేక ర‌కాల పూజలు చేస్తారు. తులాభారం, అన్నప్రస‌న్నం, నామ‌క‌ర‌ణం, వాహ‌న పూజలు జ‌రుగుతాయి. ఉగాది స‌మ‌యంలో జాతర నిర్వహిస్తారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner