Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్‌బస్‌కు తాత్కాలిక బ్రేక్, ప్రయాగ్‌రాజ్‌కు మళ్లింపు
Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్ బస్ సర్వీసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎయిర్ బస్ సర్వీస్ ను ప్రయాగ్ రాజ్ కు మళ్లించారు. 14 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో ఎయిర్ బస్ సర్వీసులు కొనసాగనున్నాయి. అనంతరం మార్చి 1 నుంచి రాజమండ్రిలో సేవలు పునరుద్ధరిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్‌బస్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. ఎయిర్‌బస్‌ను రాజమండ్రి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు మళ్లించారు. ఈ బ్రేక్ 14 రోజుల పాటు ఉంటుందని, తాత్కాలికంగా ఈ సర్వీస్ నిలిపివేసినట్లు రాజమండ్రి ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి మళ్లీ ఎయిర్‌బస్ సర్వీస్‌ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తరువాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా దిల్లీ, ముంబాయి వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు ఎయిర్ బస్సులను ప్రవేశపెట్టింది.
డిసెంబర్ 1 తేదీ నుంచి రాజమండ్రి-ముంబాయి, ముంబాయి-రాజమండ్రి ఎయిర్ బస్ సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఇండిగో ఎయిర్ బస్ మాత్రమే రాజమండ్రి-ముంబాయి మధ్య రాకపోకలను నిర్వహిస్తోంది. 114 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి ముంబాయికి, 173 మంది ప్రయాణికులతో ముంబాయి నుండి రాజమండ్రికి తొలి ఎయిర్ బస్సులు ప్రారంభమయ్యాయి. టిక్కెట్టు ధర కూడా అనుకూలంగా రూ.4,000 నుంచి రూ.8,000 వరకు ఉండేది.
14 రోజుల పాటు ఎయిర్ బస్ సేవలకు బ్రేక్
అయితే రాజమండ్రి-ముంబాయి ఎయిర్ బస్సు సర్వీస్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫిబ్రవరి 15 నుంచి 14 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 28 తేదీ వరకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ముంబాయి వెళ్లే ఎయిర్ బస్సును తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులకు ఎయిర్ పోర్టు అధికారులు ముందస్తు సమచారం అందించారు. మళ్లీ మార్చి 1వ తేదీ నుంచి యధావిధిగా రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ముంబాయికి ఎయిర్ బస్సు సర్వీసు పునరుద్ధరణ జరుగుతోందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
అయితే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభ మేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. కోట్లలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో స్నానం ఆచరిస్తున్నారు. బస్సులు, రైళ్లు ఖాళీలు లేవు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ భక్తులు, యాత్రికులు రద్దీ అదుపు చేయలేకపోతున్నారు. అందులో భాగంగానే రాజమండ్రి నుంచి ముంబాయి వెళ్లే ఎయిర్ బస్ సర్వీస్‌ను నిలిపివేసి, దాన్ని ప్రయాగ్ రాజ్‌కు మళ్లించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం