AP Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు-rains in coastal andhra heat waves in rayala seema ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు

AP Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు

Sarath chandra.B HT Telugu
May 08, 2024 05:57 AM IST

AP Weather Update: నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ఏపీలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. బుధ, గురు వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాల్లో వర్షాలతో ఉపశమనం
ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాల్లో వర్షాలతో ఉపశమనం (Photo Source From unsplash.com)

AP Weather Update: ఏపీలో మరో రెండు రోజుల పాటు వాతావరణం కాస్త చల్లబడనుంది. మండే ఎండలతో అల్లాడిపోయిన జనానికి ఊరటనిచ్చేలా వాతావరణం కాస్త మారింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో వర్షాలు కురిశాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని వివరించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 120.5 మిమీ, రాజమహేంద్రవరంలో 92 మిమీ, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5 మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిమీ, కోనసీమ జిల్లా ఆలమూరులో 73 మిమీ అధికవర్షపాతం నమోదైందన్నారు. 20మిమీ నుంచి 64 మిమీ లోపు వర్షపాతం 45 ప్రాంతాల్లో నమోదైంది.

మరో వైపు మంగళవారం రాయలసీమలో ఎండలు అదరగొట్టాయి. కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.4°డిగ్రీలు, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 43.2°C, వైయస్సార్ జిల్లా మద్దూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.9°C, నెల్లూరు జిల్లా మనుబోలు, నంద్యాల జిల్లా మహానందిలో 42.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

గత వారం కోస్తా జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ధాటికి జనం అల్లాడిపోయారు.

అకాల వర్షాలతో పంటనష్టం…

మంగళవారం సాయంత్రం ఏపీలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సీజన్‌ ప్రారంభమై కొద్ది రోజులే కావడంతో పలు ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.

భారీగా ఈదురుగాలులు రావడంతో కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పంటల నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండటంతో పంటల నష్టంపై అంచనా లేదు. కొన్ని ప్రాంతాల్లో రబీ పంటలకు కూడా నషట్ం వాటిల్లింది.

Whats_app_banner

సంబంధిత కథనం