Andhra Pradesh Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన-rains in andhra pradesh as low pressure area likely to form in southwest bay of bengal in 48 hours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

Andhra Pradesh Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

Basani Shiva Kumar HT Telugu
Nov 08, 2024 03:58 PM IST

Andhra Pradesh Rains : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పిడుగు పాటు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం కారణంగా.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెరువులు, పొలాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్లు, టవర్స్ కింద ఉండొద్దని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఆంధ్రప్రదే‌శ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని వెల్లడించింది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో కురుస్తాయి. శనివారం తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి వణికి స్తోంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయి. గురువారం పాడేరులో కనిష్ఠ 16, గరిష్ఠ 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ప్రతి ఏడాది అక్టోబరు రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. కానీ ఈ ఏడాది అక్టోబరు నెలలో వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడడంతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు.

వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురవడం, సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం చూపడం వంటి మార్పులు సంభవించాయి. గురువారం ఉదయం దట్టంగా పొగమంచు కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. చలిని తట్టుకోవడానికి పలువురు చలి మంటలు వేసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ఇటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల నమోదు కానుంది.

Whats_app_banner