AP Weather_Updates : ఏపీలోని 17 జిల్లాలపై తుఫాన్ ప్రభావం… నేడు, రేపు వర్షాలు - మరోవైపు వడగాడ్పుల హెచ్చరికలు-rain likely today and tomorrow in andhrapradesh imd latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather_updates : ఏపీలోని 17 జిల్లాలపై తుఫాన్ ప్రభావం… నేడు, రేపు వర్షాలు - మరోవైపు వడగాడ్పుల హెచ్చరికలు

AP Weather_Updates : ఏపీలోని 17 జిల్లాలపై తుఫాన్ ప్రభావం… నేడు, రేపు వర్షాలు - మరోవైపు వడగాడ్పుల హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu
May 25, 2024 08:53 AM IST

AP Weather_Updates : ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

AP Weather_Updates: ఇవాళ బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో 17 జిల్లాలపై ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో రెండు రోజులు పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుపానుగా మారింది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. తరువాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్, బంగ్లాదేశ్లోని ఖేపుపరాల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడించింది.

ఏపీలో 17 జిల్లాలపై ప్రభావం…

తుఫాను ప్రభావం రాష్ట్రంలో 17 జిల్లాలపై ఉంది. శనివారం, ఆదివారం ఆయా జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుంది. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.

ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.

కర్నూలు జిల్లాలో అత్యధిక వర్షపాతం

శుక్రవారం కర్నూలు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప వర్షపాతం రికార్డ్ అయింది. శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా తళ్లగోకులపాడులో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడలో 10.3, యలమంచిలి (అనకాపల్లి జిల్లా) 4.5, నెల్లిమర్ల (విజయనగరం) 4.3, చింతపల్లి (అల్లూరి సీతారామరాజు)లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

మళ్లీ వడగాడ్పులు…..

రాష్ట్రంలో శనివారం 35, ఆదివారం 14, సోమవారం 64 మండలాల్లో వడ గాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాను ప్రభావం రాష్ట్రంపై అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వడగాడ్పులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచాయి.

శనివారం విజయనగరం జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యంలో 5, అనకాపల్లిలో 5 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలో 6 శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.

సోమవారం విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళంలో 17, పార్వతీపురం మన్యంలో 8, కృష్ణాలో 7, అనకాపల్లిలో 6, విశాఖపట్నంలో 2, ఏలూరులో 2, తూర్పు గోదావరిలో 1, బాపట్లలో 1 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ.

టీ20 వరల్డ్ కప్ 2024