AP Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్షసూచన
AP Weather Update : కన్యాకుమారి సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. బుధవారం కూడా ఈ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు.

రాయలసీమలో..
రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావారణ కేంద్రం జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాంలలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉందని అధికారులు వివరించారు. అటు రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్గాలు, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు (గురువారం) పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. దక్షిణ కోస్తాలో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
కల్లక్కడల్ ముప్పు..
అటు తమిళనాడు, కేరళ తీరాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని.. ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. బుధవారం (జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా.. బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని.. ఐఎన్‌సీవోఐఎస్ హెచ్చరించింది.
కేరళ తీరంలో అలర్ట్..
కేంద్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో.. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంతాల ప్రజలు చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని సూచించింది. పర్యాటకులు కూడా బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.