AP Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ 6 జిల్లాలకు వర్షసూచన.. రైతుల్లో ఆందోళన
AP Rain Alert : ఏపీ ప్రజలను వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా ఫెంగల్ తుపానుతో రైతులు అల్లాడిపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా 6 జిల్లాలకు వర్షసూచన ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది.
డిసెంబర్ 7న శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని.. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది డిసెంబర్ 7వ తేదీ వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక - తమిళనాడు తీరాల వద్దకు చేరుతుందని అంచనా వేసింది.
అటు తెలంగాణలోనూ డిసెంబర్ 11వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఉపరిత ఆవర్తనం, అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రావొచ్చని అధికారులు చెబుతున్నారు. చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఫెంగల్ పంజా..
ఇటీవల ఏపీని ఫెంగల్ తుపాను వణికించింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టంచాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట వర్షం పాలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. మళ్లీ వర్షాలు వస్తాయనే వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
చంద్రబాబు సమీక్ష..
ఏపీలో ధాన్యం కొనుగోలుపై గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగాఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్ల చెల్లింపులు జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గతేడాది ఈ సమయానికి.. 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఒక రికార్డు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.