Anakapalle : అన‌కాప‌ల్లిలో కుంగిన రైల్వే బ్రిడ్జి.. తప్పిన ప్రమాదం.. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లకు అంత‌రాయం-railway underbridge collapses in anakapalle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalle : అన‌కాప‌ల్లిలో కుంగిన రైల్వే బ్రిడ్జి.. తప్పిన ప్రమాదం.. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లకు అంత‌రాయం

Anakapalle : అన‌కాప‌ల్లిలో కుంగిన రైల్వే బ్రిడ్జి.. తప్పిన ప్రమాదం.. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లకు అంత‌రాయం

HT Telugu Desk HT Telugu

Anakapalle : అన‌కాప‌ల్లిలో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి కుంగింది. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పడింది. ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరమ్మత్తులు అయ్యేవరకు రైళ్లను అనుమతించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కుంగిన రైల్వే బ్రిడ్జిని పరిశీలిస్తున్న అధికారులు

అన‌కాపల్లిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌రామ‌రాజు పేట అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద సేఫ్టీ గ‌డ్డ‌ర్‌ను.. ఆదివారం రాత్రి క్వారీ రాళ్ల‌ను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్ర‌మంలో సెఫ్టీ గ‌డ్డ‌ర్ కొద్దిమేర దెబ్బ‌తిన‌డంతో బ్రిడ్జి కుంగింది. రైల్వే ట్రాకులు ప‌క్క‌కి జ‌రిగాయి. అదే స‌మ‌యంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వ‌చ్చింది. ట్రాక్ ప‌క్క‌కి జ‌రిగిన విష‌యాన్ని గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైల‌ట్.. వెంట‌నే రైలును నిలిపివేశారు. రైల్వే అధికారుల‌కు స‌మాచారం అందించారు.

రైళ్లు నిలిపివేత..

రైల్వే అధికారులు, సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. విశాఖ‌ప‌ట్నం- విజ‌య‌వాడ మార్గంలో ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లను నిలిపివేశారు. విజ‌య‌వాడ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్లే ఎనిమిది రైళ్ల‌ను నిలిపివేశారు. క‌శింకోట వ‌ద్ద గోదావ‌రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ల‌ను నిలిపివేశారు. ఎల‌మంచిలి వ‌ద్ద మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దెబ్బ‌తిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మ‌ర‌మ్మ‌త్తులు చేస్తున్నారు.

ప్ర‌మాదం త‌ప్పింది..

గూడ్స్ రైలు లోకోపైల‌ట్ గుర్తించ‌డంతోనే పెను ప్ర‌మాదం తప్పింది. ఆ స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నం వైపు నుంచి విజ‌య‌వాడ వైపు ఖాళీ గూడ్స్ రైలు వ‌స్తోంది. విధి నిర్వ‌హ‌ణ‌లో నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండే లోకో పైల‌ట్లు.. ఇలాంటి ప‌రిస్థితుల‌ను దాదాపుగా ముందుగానే ప‌సిగ‌డ‌తారు. అందులో భాగంగానే గూడ్స్ రైలు లోకో పైలట్ అన‌కాప‌ల్లి అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద రైల్వే ట్రాక్‌లు ప‌క్కకు జ‌ర‌గ‌డాన్ని గుర్తించారు. వెంట‌నే అప్ర‌మ‌త్తమై రైలును నిలిపివేశాడు. అనంత‌రం రైల్వే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించారు. ఒక‌వేళ ఏమాత్రం అశ్ర‌ద్ధ‌గా ఉన్నా పెను ప్ర‌మాదం చోటు చేసుకునేంది. అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించిన లోకో పైల‌ట్‌ను అంద‌రూ అభినందించారు.

ఢీకొన్న లారీ గురించి ఆరా..

అన‌కాప‌ల్లిలో రాళ్ల క్వారీలు అధికంగా ఉంటాయి. నిర్మాణ ప‌నుల‌కు రాళ్ల స‌ర‌ఫ‌రా అక్క‌డి నుంచే జ‌రుగుతోంది. అందుకోస‌మే అధిక సంఖ్య‌లో లారీల రాక‌పోక‌లు నిర్వ‌హిస్తాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా దుమ్ము, దూళితో నిండిపోతోంది. ఇది ప‌క్క‌న పెడితే.. ఇక్క‌డ లారీ ప్ర‌మాదాలు అధికంగానే చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే అధిక బ‌రువుతో ఉన్న లారీ రైల్వే అండర్ బ్రిడ్జి సెఫ్టీ గ‌డ్డ‌ర్‌ను ఢీకొన‌డంతో ఆ బ్రిడ్జి కుంగింది. ఢీకొన్న లారీ, దాని డ్రైవ‌ర్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్ర‌జ‌లు కూడా ఆ లారీ ఎవ‌రిది? ఏ క్వారీ నుంచి వ‌చ్చింది? లారీ డ్రైవ‌ర్ ఎవ‌రూ అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

ఊపిరి పీల్చుకున్న ప్ర‌జ‌లు..

ఎటువంటి ప్ర‌మాదం చోటు చేసుకోక‌పోవ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక‌వేళ ఏదైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న చోటు చేసుకున్నా.. భారీ న‌ష్టం త‌లెత్తేది. ఎందుకంటే రైల్వే ట్రాక్ వెంబ‌డి రెండువైపుల చాలామంది నివాసం ఉంటున్నారు. ఎదైనా ప్ర‌మాదం చోటు చేసుకుంటే స్థానికుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగేది. లోకో పైల‌ట్ ముందుగానే గ‌మ‌నించ‌డంతో ఎటువంటి ప్ర‌మాదం జరగలేదు. దీంతో అన‌కాప‌ల్లి ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బ‌తిన్న బ్రిడ్జి సెఫ్టీ గ‌డ్డ‌ర్‌ను తాత్కాలికంగా మ‌రమ్మ‌త్తులు చేయ‌డంతో పాటు.. శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌ని స్థానికులు కోరుతున్నారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk