Vande Bharat Express: చెన్నై-విజయవాడ, కాచిగూడ-బెంగుళూరు మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు-railway department has announced two more vande bharat trains for telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vande Bharat Express: చెన్నై-విజయవాడ, కాచిగూడ-బెంగుళూరు మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు

Vande Bharat Express: చెన్నై-విజయవాడ, కాచిగూడ-బెంగుళూరు మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు

HT Telugu Desk HT Telugu
Published Sep 21, 2023 06:29 AM IST

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్‌ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ నెల 24నుంచి కొత్త రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ, కాచిగూడ - బెంగుళూరు మధ్య ఇవి ప్రయాణించనున్నాయి.

ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభం
ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభం

Vande Bharat Express: విజయవాడ నుంచి చెన్నైకు మరో రైలు ప్రారంభం కానుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-చెన్నై మధ్య నడిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది.ఈ నెల 24న ప్రారంభించే రైళ్లలో వందే భారత్ రైలు కూడా ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం మినహా వారంలో మిగిలిన రోజుల్లో నడిచే ఈ రైలు రోజూ ఉదయం విజయవాడలో 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది.

ప్రస్తుతం విజయవాడ చెన్నై మధ్య నడుస్తున్న ఇంటర్‌ సిటీ పినాకిని ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఈ రైలు ప్రయాణ సమయం ఆరున్నర గంటలు ఉంది. చెన్నైలో త్వరగా పనులు ముగించుకుని తిరుగు ప్రయాణం అవ్వాలనుకునే వారికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అనువుగా ఉండనుంది. ప్రస్తుతం పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగే స్టేషన్లు తక్కువ కావడంతో వందేభారత్‌కు ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.

చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారైన కాషాయ రంగు వందేభారత్‌ తొలి రైలును కేరళ రాష్ట్రానికి కేటాయించారు. కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వయా అలెప్పి మార్గంలో ఈ సర్వీసును నడపాలని రైల్వేబోర్డు అధికారులు దక్షిణ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

ఆదివారం ప్రారంభించే వందేభారత్‌ రైళ్లలో హైదరాబాద్‌, బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు కూడా ఉంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌) మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

కాచిగూడ రైల్వేస్టేషన్‌ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. సోమవారం నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30కు బయలుదేరి.. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగనున్నాయి.

Whats_app_banner