Paderu Ragging : పాడేరులో ర్యాగింగ్ కలకలం.. ఏడో తరగతి చిన్నారిపై టెన్త్ విద్యార్థుల దాడి!
Paderu Ragging : ర్యాగింగ్ భూతం ఏజెన్సీ ప్రాంతాలకు పాకింది. స్కూల్ విద్యార్థులే ర్యాగింగ్‌కు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పాడేరులోని ఓ స్కూలులో టెన్త్ విద్యార్థినులు.. ఏడో తరగతి చిన్నారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాడేరులో ఓ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఉంది. అ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థినిపై.. అదే స్కూళ్లో చదువుతున్న టెన్స్ స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 5న ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. టెన్త్ క్లాస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు దాడి చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు.
వీడియో వైరల్..
ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఫిబ్రవరి 16న వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆ స్కూలు హాస్టల్‌ను సందర్శించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థినులతో మాట్లాడారు. సంఘటన గురించి ఆరా తీశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు.
ఎమ్మెల్యే ఆగ్రహం..
సదరు పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉందన్నారు. విద్యార్థినులపై యాజమాన్యం పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని.. భవిష్యత్తులో ఇలాంటివి పునారావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
అధికారుల విచారణ..
ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. స్థానిక ఎంఈవో విశ్వప్రసాద్ పాఠశాలకు వెళ్లారు. విచారణ చేపట్టారు. హాస్టల్ నిర్వాహకురాలిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంఈవోకు చెప్పారు. అటు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను వసతిగృహం నుంచి ఇంటికి పంపించినట్టు స్పష్టం చేశారు.
విద్యార్థినుల మధ్య గొడవలు..
ఆ స్కూళ్లో సుమారు 800 మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. దీనికి అనుబంధంగా ఉన్న హాస్టల్ ఉంది. దాంట్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులు కొందరు ఉంటున్నారు. అయితే.. విద్యార్థినుల మధ్య గొడవలు జరిగాయి. తమపై ఫిర్యాదు చేస్తావా.. అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు వార్డెన్‌కు చెప్తావా అంటూ ఇటీవల ఏడో తరగతి విద్యార్థినిపై దాడి చేశారు.
అసభ్యంగా తిట్టిందని..
విచారణలో భాగంగా.. ఎంఈవో పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినులతో మాట్లాడారు. తమను ఏడో తరగతి విద్యార్థిని అసభ్యంగా తిట్టిందని.. అందుకే దాడి చేసినట్లు టెన్త్ స్టూడెంట్స్ చెప్పారు. దీంతో వారిని ఇంటికి పంపేశారు. అటు వార్డెన్‌ను కూడా విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఎంఈవో విశ్వప్రసాద్ వివరించారు.