Amaravati Raft Foundation: సురక్షితంగా అమరావతి సచివాలయ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్.. నీటి నుంచి బయట పడిన పునాదులు
Amaravati Raft Foundation: రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో నీటి ముంపులో ఉన్న పునాదులు ఎట్టకేలకు బయటపడ్డాయి. ఐదేళ్లకు పైగా వర్షపు నీటిలో మునిగి ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ బయటపడింది. నిర్మాణాలను కొనసాగించడానికి అనువుగానే పునాదులు ఉన్నాయని ఐఐటీ మద్రాస్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది.
Amaravati Raft Foundation: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా సచివాలయ భవనాల నిర్మాణం కోసం భూమి లోపల రాతిఫలకాలను తాకుతూ ఏర్పాటు చేసిన రాఫ్ట్ ఫౌండేషన్ ఎట్టకేలకు బయట పడింది. దాదాపు ఐదేళ్లుగా ఈ పునాదులు నీటి ముంపులో ఉన్నాయి. 2018లో అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం కోసం పనుల్ని ప్రారంభించారు. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగంతో రాఫ్ట్ ఫౌండేషన్ పద్దతిలో పునాదులు తవ్వి నిర్మాణాలు చేపట్టారు. ఫౌండేషన్ పూర్తయ్యే దశలో 2019లో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత నేపథ్యంలో అమరావతి పనులు నిలిపివేశారు.
దీంతో 2019 నుంచి దాదాపు ఐదున్నరేళ్లుగా ఈ పునాదుల్లో వర్షపు నీటిలో మునిగి పోయాయి. 2024లో ప్రభుత్వం మారిన వెంటనే పునాదుల పటిష్టతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాదులు పరిశీలించి నిర్మాణాలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఆ తర్వాత సీఆర్‌డిఏ టెండర్లను ఖరారు చేసి నీటి తోడే ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 20 రోజులో భారీ మోటర్లతో ఫౌండేషన్లో నీటిని తొలగించే పనులు చేపట్టారు.
ఆదివారం అమరావతి ఐకానిక్ టవర్ల పునాదులు బయట పడ్డాయి. మొత్తం ఐదు టవర్లుగా ఈ నిర్మాణాలను చేపట్టారు. మొదటి రెండు టవర్ల వద్ద నీటిని దాదాపుగా బయటకు తోడేశారు. మిగిలిన టవర్ల వద్ద ఉన్న నీటని రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్ల పునాదుల్లో దాదాపు 16 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో నీరు చేరింది. నీటిని తోడేందుకు రూ. 88 లక్షలతో సీఆర్డీఏ పనులు అప్పగించింది. భారీ ఇంజెన్లు, ట్రాక్టర్లతో నీటిని బయటకు తోడేశారు. ఆదివారం ఈ టవర్లు పూర్తిగా బయట పడ్డాయి. ర్యాఫ్ట్ ఫౌండేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
నీటిని పూర్తిగా తోడిన తరువాత ఐకానిక్ టవర్ల నిర్మాణం తిరిగి ప్రారంభించనున్నారు. పనుల ప్రారంభానికి ముందు ఐఐటీ నిపుణులతో పునాదులను మరోమారు పరీక్షించనున్నారు. గతంలో నిర్ణయించిన డిజైన్ల ప్రకారమే టవర్ల నిర్మాణం కొనసాగిస్తారని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. భవనాల ఎత్తును తగ్గించాలనే సూచనలు వస్తే ఆ మేరకు డిజైన్లు మారుతాయని చెబుతున్నారు.
ప్రస్తుతం నీటిని పూర్తిగా తోడేసినా చివర్లో బురద ఎక్కువగా ఉంది. దానిని కూడా తోడేందుకు శ్రమిస్తున్నారు. గత నెల 25న నీటిని తోడే పనులు ప్రారంభించారు. దాదాపు 24 రోజులపాటు నిర్విరామంగా మోటర్లతో నీటిని తోడారు. ఆదివారం సాయంత్రం 1,2 బ్లాకుల రాఫ్ట్ ఫౌం డేషన్ దర్శనం ఇచ్చింది. 2018 డిసెంబరు 7న నిర్మాణ పనులు ప్రారం చారు. 2019 జూన్‌లో పనులు నిలిచిపోయాయి. భవనాల పునాదుల్లోకి 16 అడుగుల ఎత్తున నీరు నిలిచింది. ప్రస్తుతం రెండు బ్లాకులు నీటి నుంచి బయటపడగా మిగిలిన వాటిని కూడా త్వరలో తోడేస్తామని చెబుతున్నారు. టవర్ల నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో నీటి ఊట బాగా వస్తుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా ఎండిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.