తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి… భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.
ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం ఉంటుంది. ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు. కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సంబంధిత కథనం