President Droupadi Murmu : శ్రీ సత్యసాయి బాబా 98వ జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ ఛైర్మన్ రత్నాకర్, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ... మానవసేవే మాధవసేవ అని బోధించిన శ్రీసత్యసాయి సేవలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడండి, ధర్మాన్ని పాటించండి అన్న సత్యసాయి వ్యాఖ్యలను నిత్య జీవితంలో పాటించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభ కనబరచిన శ్రీసత్యసాయి బాబా విద్యాసంస్థల విద్యార్థులకు పట్టాలతో పాటు 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందించారు.
సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ఆలోచన, క్రియ, మాటల ద్వారా సత్యానికి విధేయత అనే సందేశాన్ని బాబా బోధించారన్నారు. సత్యాన్ని నిరంతరం శోధించడం, దానికి కట్టుబడి ఉండాలనే ఆదర్శానికి మన సంస్కృతిలో ప్రాధాన్యత ఉందన్నారు. భారతీయ సమాజంలో, ఆధ్యాత్మిక సంప్రదాయంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఇచ్చారన్నారు. నేడు ప్రతి రంగంలో, సైన్యంలో కూడా, మన కుమార్తెలు తమదైన ముద్ర వేస్తున్నారన్నారు. చాలా ఉన్నత విద్యాసంస్థల్లో పతకాలు, డిగ్రీలు పొందుతున్న బాలికల సంఖ్య అబ్బాయిల కంటే ఎక్కువగా ఉండడం గమనించానన్నారు. విద్య పట్ల శ్రీ సత్యసాయి సంస్థాన్ సమగ్ర విధానం తనను బాగా ఆకట్టుకుందన్నారు.
'విద్యకు బదులుగా, మీరు ఎడ్యుకేర్ వంటి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌ని ఉపయోగించారు. మానవీయ విలువలపై ఆధారపడిన సమగ్ర విద్యను ఎడ్యుకేర్ అని పిలవడం చాలా ఉపయోగకరంగా అర్థవంతంగా ఉంటుంది. మీ ఇన్‌స్టిట్యూట్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ లేదా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మార్గాన్ని కూడా అవలంభించింది. నిజంగా నేర్చుకునే వ్యక్తి వినయం, దాతృత్వం, సున్నితత్వం కలిగి ఉంటారు. ఈ సంస్థలో, మానవ, ఆధ్యాత్మిక విలువలకు ప్రాథమిక ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఈ ఉన్నత విద్యాసంస్థ నిజంగా విద్యా మందిరం, ఆధునిక గురుకులం. జీవిత విలువలను, నైతికతను బోధించడమే నిజమైన విద్య అని నా వ్యక్తిగత అనుభవం. భవన నిర్మాణానికి బలమైన పునాది ఎంత అవసరమో, అలాగే జీవిత నిర్మాణానికి నైతికత, జీవిత విలువల పునాది కూడా చాలా అవసరం. ప్రపంచ సమాజానికి భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి ఆధ్యాత్మికత. కాలానుగుణంగా, మన దేశంలో గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు ధర్మం, కరుణ, దాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేశారు. పుట్టపర్తిలోని ఈ ప్రాంతాన్ని పవిత్రం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ సత్యసాయి బాబా. దేశ విదేశాల్లోని కోట్లాది మంది ప్రజలు ఆయన ఆశీస్సుల వల్ల ప్రయోజనం పొందుతున్నారు.' - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము