Puthalapattu Mla: వైసీపీలో దళితుల్ని బలి చేస్తున్నారంటున్న పూతలపట్టు ఎమ్మెల్యే బాబు
Puthalapattu Mla: వైఎస్సార్సీపీలో దళిత ఎమ్మెల్యేలనే బలి చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు.తాను చేసిన తప్పేమిటో చెప్పకుండా సర్వేల్లో బాగోలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
Puthalapattu Mla: ప్రజల్లో తనపై ఏమి వ్యతిరేకత ఉందో చెప్పాలని ముఖ్యమంత్రిని అడిగినా సమాధానం చెప్పలేదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. దళితుల మీద బురద చల్లడం సరికాదన్నారు. తాను చేసిన తప్పేమిటో సిఎం జగన్ చెప్పాలన్నారు.
ఓసీ అభ్యర్థులు ఉన్నచోట ఎక్కడ అభ్యర్థిని మార్చడం లేదన్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం దళితులు ఉన్న చోటే అభ్యర్థుల్ని మారుస్తున్నారని అన్నారు. సర్వే రిపోర్ట్ బాగోలేదు, నీ మీద వ్యతిరేకత ఉందని చెబితే ఏమి వ్యతిరేకత ఉందో చెప్పాలని తాను సిఎంను కోరానని చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్న వారిలో దళితులే ఎందుకు ఉన్నారని బాబు ప్రశ్నించారు.
దళితుల మీదే ఎందుకు బురద చల్లుతున్నారని వైసీపీ పెద్దల్ని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు ప్రశ్నించారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న చోటే ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఆరోపించారు. సిఎం నిర్ణయాన్ని తాము ఎలా ఓర్చుకోగలమని ప్రశ్నించారు. జగన్ చేసిందే తాను చేశానని, ఇప్పుడు తన తప్పు ఉందంటే ఎలా అని ప్రశ్నించారు.
మరోవైపు సిఎంతో భేటీ సందర్భంగా జిల్లాను చెప్పు చేతల్లో పెట్టుకున్న ఇద్దరు నాయకులే అంతా చేశారని తానేం తప్పు చేశానని బాబు ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్టు ప్రచారం జరిగింది. దళితుడిని కాబట్టే తనను బలి చేస్తున్నారని ముఖ్యమంత్రి సమక్షంలో అక్రోశం వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఎంఎస్.బాబు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారని, నాలుగున్నరేళ్లు నియోజక వర్గాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని తప్పులు చేసిన వారిని వదిలేసి తనను బలిచేయడం ఏమిటని నిలదీసినట్టు చెబుతున్నారు. మంగళవారం బాబు నేరుగా ముఖ్యమంత్రిని నిలదీస్తూ ప్రశ్నించారు. తాను చేసిన తప్పులు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.