Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈనెల 8, 9 తేదీల్లో పలు సేవలు రద్దు..!
TTD Pushpayaga Mahotsavam 2024: శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. నవంబరు 9న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనున్నట్లు తెలిపింది. పుష్పయాగం సందర్భంగా.. 9వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారని ప్రకటించింది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనున్నట్లు ప్రకటించింది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం ఉంటుంది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు…
నవంబరు 8న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుంది. దీని కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. నవంబరు 9వ తేదీన పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.
పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం:
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే దక్కింది.
‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు:
మరోవైపు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది.
ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల‌్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.
ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు.
సంబంధిత కథనం