Puradeswari Letter: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడంతో పాటు ఏపీ ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రికి పురందేశ్వరి లేఖను అందచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్లతో పాటు బెవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక నేరాల విచారణ సంస్థ ద్వార దర్యాప్తు చేయాలని పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది జులై 26న రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలతో పాటు అప్పటి వరకు చేసిన అప్పులు రూ.10.77 లక్షల కోట్లను చేరాయనే అంశాలను నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినట్లు గుర్తు చేశారు. ఆ తరువాత నేటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు జవాబుగా కేవలం ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే వెల్లడించిందని, రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత మీడియాతో పాటు లక్షలాది వాలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో తిరిగి కట్టలేని తిప్పలు నుండి బయట పడవేయాలనే రాష్ట్ర బిజేపి ప్రయత్నాలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలపై, ఆస్తుల తనఖ పెట్టి తెచ్చిన అప్పులు మరియు ఇతర సావరీన్ గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించుకున్న కాంట్రాక్టర్లకు, సేవలకు, సప్లయర్లకు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై చెల్లించాల్సిన మొత్తాలకు కోర్టుల నుండి ఆదేశాలున్నా, నాలుగు సంవత్సరాలుగా చెల్లింపులు చేయలేని దయనీయ స్థితిలోకి రాష్ట్రాన్ని తెచ్చారని పురందేశ్వరి చెప్పారు.
రాష్ట్రంలో మున్సిపల్ పన్ను లేదా బిల్లు, ఆస్థి పన్ను , విద్యుత్ బిల్లులు, రాష్ట్ర పన్నులు ఆలస్యంగా కడితే 18% అదనంగా వసూళ్లు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం సకాలంలో చెల్లించని బకాయలకు ఎందుకు అదే శాతం వడ్డి కట్టరని రాష్ట్రంలోని వర్తక వాణిజ్య సంఘాలు ప్రశ్నిస్తూన్నాయని, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత ఆదాయం 90 వేల కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 35 వేల కోట్లు, మొత్తం ఆదాయం దాదాపు 1 లక్ష 35 వేల కోట్ల రూపాయలుగా ఉందని బడ్జెట్ ప్రకారం రాష్ట్రం వ్యయం 2.60 లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. ఆదాయం పోను మిగిలిన 1.25 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఏఫ్ఆర్బీఏం పరిధిలో ఆర్బీఐ నుండి అప్పులు మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల అప్పుల ద్వారా పక్కకు మల్లించిన నిధులు ద్వార సమకూర్చుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం కేవలం 90 వేల కోట్ల రూపాయల మాత్రమే అయినప్పుడు ఎలా ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయగలుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్ మరియు అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం నెత్తిన ఉన్న మోత్తం అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే, సగటున ఏడాదికి 8% వడ్డీ అనుకున్నా కూడా వడ్డీ మాత్రమే 88 వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు.
ఈ అప్పు రాబోయే 30 సంవత్సరాల్లో తీర్చాలన్నా సంవత్సరానికి కనీసం 36 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ లో తక్కువ ప్రతి సంవత్సరం 1.24 లక్షల కోట్ల రూపాయలను అసలు అప్పు మరియు వడ్డీ క్రింద కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించాలని పురందేశ్వరి కోరారు.