ఆంధ్రప్రదేశ్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం అందుబాటులోకి తెచ్చిన పురమిత్ర యాప్ ప్రజలకు నాణ్యమైన పౌర సేవల్ని అందించడంలో తోడ్పడుతోంది.
పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఎవరికైనా కనీస అవసరాలు.. పట్టణ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసేందుకు ఉండే ఉత్సాహం పౌర సేవల విషయంలో ఉండదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన పౌర సేవల కోసం మొబలై్ అప్లికేషన్‌ను పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
పుర మిత్ర యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుంటే చాలు ఫిర్యాదిదారుడు ఎక్కడి నుంచైనా ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. శానిటేషన్, పబ్లిక్ హెల్త్, తాగునీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, పట్టణ పేదరిక నిర్మూలన, మునిసిపాలిటీల్లో పరిపాలనా వ్యవహారాలు, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైటింగ్, రెవిన్యూ వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలోని 95 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు ఉన్నాయి.పట్టణ ప్రజలు పౌర సేవల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. ఏ చిన్న అవసరం వచ్చినా మునిసిపల్ కార్యాలయాలను, సచివాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది.
మున్సిపల్ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరించేలా పురమిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిర్యాదును 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం పురమిత్ర యాప్‌లో శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 53రకాల సేవలు, తాగునీటి సరఫరాపై నాలుగు రకాల సేవలు, టౌన్ ప్లానింగ్ విభాగంలో 13 రకాల సేవలు, పట్టణ పేదరిక నిర్మూలనలో 12 రకాల సేవలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత సేవల్లో 6 రకాలు, ఇంజనీరింగ్ విభాగంలో 16 రకాల సేవలు, స్ట్రీట్ లైట్స్ సమస్యలు 3 రకాలు, రెవిన్యూ సంబంధిత సేవల్లో 12 రకాల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. అన్ని విభాగాల్లో కలిపి 100కు పైగా పౌర సేవల్ని తక్షణమే అందించేలా ఏర్పాటు చేశారు.
పురపాలికల్లో ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగం తక్షణం స్పందించేలా ఇప్పటికే అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిర్యాదులు అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు, నేరుగా ఫోటోలను అప్‌లోడ్ చేసేందుకు యాప్‌లోనే ఫోటోలు తీసేందుకు అవకాశం కల్పించారు. ఫిర్యాదులను టెక్స్ట్, వాయిస్ మెసేజీల రూపంలో పంపొచ్చు. సమస్య తీవ్రతను బట్టి తక్షణం స్పందించేలా అధికార యంత్రాంగానికి అవగాహన కల్పించారు.
"పుర మిత్ర" యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. యాప్‌ను అన్ని వర్గాల ప్రజలు వినియోగించేలా సులువుగా అర్థమయ్యేలా డిజైన్ చేశారు.
ఏపీలో పౌర సేవలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. పీజీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేస్తుంది. పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
పీజీఆర్ఎస్‌తో పోలిస్తే పురమిత్ర అప్లికేషన్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరుగుతోంది. వీధి దీపాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి ఫిర్యాదులను కార్పొరేషన్ల పరిధిలో గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తోంది.
గతంలో ప్రజా సమస్యలపై గ్రామ, వార్డుసచివాలయాలకు అనుబంధంగా పనిచేసిన వాలంటీర్ల దృష్టికి తీసుకు వెళితే వారి ద్వారా సచివాలయ సిబ్బంది మునిసిపల్ సేవల్ని అందించే వారు. ప్రస్తుతం ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా సమస్యను నమోదు చేస్తే వాటిని పరిష్కరించేలా మొబైల్ యాప్ పని చేస్తోంది.
పురపాలక శాఖ పురమిత్ర యాప్ ద్వారా అందిస్తున్న సేవలు ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెవిన్యూ, సివిల్ సప్లైస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, కమర్షియల్ టాక్సెస్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో మెటా భాగస్వామ్యంతో వాట్సాప్‌లోనే పౌర సేవలు అందుతున్నాయి. ఫిర్యాదుల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ను వినియోగిస్తున్నారు.
సంబంధిత కథనం