Pulivendula TDP Fight : పులివెందుల టీడీపీలో ఆధిపత్యపోరు, ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ-pulivendula tdp leaders fight btech ravi vs mlc ramgopal reddy both supporters struggle for supremacy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pulivendula Tdp Fight : పులివెందుల టీడీపీలో ఆధిపత్యపోరు, ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ

Pulivendula TDP Fight : పులివెందుల టీడీపీలో ఆధిపత్యపోరు, ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ

HT Telugu Desk HT Telugu
Jan 18, 2025 04:30 PM IST

Pulivendula TDP Fight : పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మె్ల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల ఉద్యోగాల కోసం ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

పులివెందుల టీడీపీలో ఆధిపత్యపోరు, ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ
పులివెందుల టీడీపీలో ఆధిపత్యపోరు, ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ

Pulivendula TDP Fight : క‌డ‌ప జిల్లా పులివెందుల టీడీపీలో ఏం జ‌రుగుతోందనే చ‌ర్చ స‌ర్వత్రా నెల‌కొంది. టీడీపీ ఎమ్మెల్సీ వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్సీ అన్న విధంగా ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈ పోరులో భౌతిక దాడులు వ‌ర‌కు వెళ్లారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. నేత‌ల ఆధిపత్య పోరుకు కార్యక‌ర్తలు బ‌ల‌వుతున్నార‌ని అంటున్నారు. ఇద్దరు నేత‌లు త‌లోదారిలో ఉన్నార‌న్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

yearly horoscope entry point

రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగ‌తంగా నిర్మించాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ పాల‌న‌, పార్టీ కార్యక్రమాలు రెండింటికి స‌మాన ప్రాధాన్యత ఇవ్వాల‌ని పార్టీ నేత‌లకు సూచించారు. అయితే పులివెందులలో అందుకు భిన్నంగా టీడీపీ నేత‌లు వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీ సంస్థాగ‌తంగా బలోపేతం కాక‌పోగా, మ‌రింత పార్టీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని కార్యకర్తలు అభిప్రాయప‌డుతున్నారు.

పులివెందుల టీడీపీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్ ర‌వి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతోంది. ఇసుక టెండ‌ర్లు, రేష‌న్ డీల‌ర్ల పోస్టుల విష‌యంలో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇసుక టెండ‌ర్ల త‌మ వారికే ద‌క్కాల‌ని, మ‌రెవ్వరికీ ఇసుక టెండ‌ర్లు రావొద్దని బీటెక్ ర‌వి వ‌ర్గీయులు క‌లక్టరేట్‌లో హ‌డావుడి చేశారు. అది మ‌ర‌క‌ముందే, మ‌రుస‌టి రోజే రేష‌న్ డీల‌ర్ల పోస్టులు త‌మ వ‌ర్గీయుల‌కే ద‌క్కాల‌ని, మ‌రెవ్వరినీ ప‌రీక్షకు అనుమ‌తించొద్దని బీటెక్ ర‌వి వ‌ర్గం రాద్దాంతం చేసింది. దీంతో రాంగోపాల్ రెడ్డి, బీటెక్ ర‌వి వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది.

రేష‌న్ డీల‌ర్ల విష‌యంలో త‌మ త‌మ ఆధిప‌త్యం చాటుకునేందుకు టీడీపీ నేత‌లు బాహాబాహీకి దిగారు. త‌మ వ‌ర్గానికి చెందినవారే డీల‌ర్ పోస్టుల ప‌రీక్షకు అనుమ‌తించాల‌ని రెండు వ‌ర్గాలు ముందుకు వ‌చ్చాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేవ‌లం త‌మ వాళ్లే ప‌రీక్ష రాసి షాపులు పొందాలంటూ ఇరువార్గాల ప‌ట్టుబ‌ట్టాయి. ఈ ఘ‌ర్షణ‌లో టీడీపీ కార్యకర్తల‌కు గాయాలు అయ్యాయి.

ఈ క్రమంలో రాంగోపాల్ రెడ్డి వ‌ర్గీయుడు, వేంప‌ల్లికి చెందిన ప్రకాష్‌పై బీటెక్ ర‌వి అనుచ‌రులు దాడి చేశారు. ఆయ‌న‌ను చిత‌క‌బాది కిడ్నాప్ కూడా చేయ‌డంతో పులివెందుల్లో క‌ల‌క‌లం రేపింది. దీంతో దాడికి నిర‌స‌న‌గా ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స‌తీమ‌ణి ఉమాదేవి ధర్నాకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయ‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. ప‌రీక్షా కేంద్రం వ‌ద్దే ఇరు వ‌ర్గాల కార్యకర్తలు భారీగా మోహ‌రించాయి.

ఇలాగైతే పార్టీని సంస్థాగతంగా నిర్మించ‌డం సాధ్యం కాద‌ని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేక‌పోతే పార్టీ బ‌లోపేతం ఎలా అవుతుంద‌ని ప‌లువురు కార్యక‌ర్తలు అంటున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల‌ని, పులివెందుల‌లో టీడీపీలో నెల‌కొన్న వ‌ర్గ, ఆధిప‌త్య పోరును చ‌క్కదిద్దాల‌ని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ ర‌వి క‌లిసి ప‌నిచేసేలా చ‌ర్యలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందని అంటున్నారు. చంద్రబాబు క‌డ‌ప జిల్లా ప‌ర్యట‌న‌లో దీనికి ప‌రిష్కారం దొరుకుతుంద‌ని కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం