garbage tax : చెత్త పన్నుతో చిక్కులు… నేతల్ని నిలదీస్తున్న ప్రజలు-public protests against garbage collections in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Garbage Tax : చెత్త పన్నుతో చిక్కులు… నేతల్ని నిలదీస్తున్న ప్రజలు

garbage tax : చెత్త పన్నుతో చిక్కులు… నేతల్ని నిలదీస్తున్న ప్రజలు

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 10:32 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను సేకరణ వ్యవహారం రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజలు పన్ను వసూళ్లపై నిలదీస్తుండటంతో ప్రజల ముందు నేతలు నీళ్లు నమలాల్సి వస్తోంది.

<p>చెత్త సేకరణ పన్ను వసూలుపై రగడ</p>
చెత్త సేకరణ పన్ను వసూలుపై రగడ

చెత్త పన్ను ఏపీలో అధికార పార్టీ నేతల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఇళ్లు, వ్యాపార సంస్థలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి ముక్కు పిండి చెత్త పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జనం మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రజా ప్రతినిధులు చెత్త పన్ను వసూలు చేయొద్దని తీర్మానాలు చేస్తున్నారు.

yearly horoscope entry point

మరోవైపు చెత్త పన్ను వసూలు చేయకపోతే వేతనాలలో కోత విధించాలని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రధాన పట్టణాలు, కార్పొరేషన్లలో చెత్త పన్ను వసూలు కోసం కింది స్థాయి సిబ్బందిని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించి సిబ్బందితో బలవంతంగా పన్ను వసూళ్లు చేయాలని ఆదేశించడం హక్కుల ఉల్లంఘనేనని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఏపీలో చెత్త సేకరణపై పన్ను వసూలు చేయాలనే నిర్ణయం పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా తయారైంది. పన్ను కోసం వెళ్లే సిబ్బందిని జనం దుమ్మెత్తి పోస్తుంటే, ప్రజా ప్రతినిధులు ముఖం చెల్లక తప్పించుకోవాల్సి వస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనని కార్పొరేషన్లు సర్క్యులర్‌లు జారీ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో చీఫ్‌ మెడికల్ ఆఫీసర్ పేరుతో సర్క్కులర్‌ జారీ చేయడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెత్త పన్ను వసూలు చేస్తున్న ప్రజలకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల్లో ఏరియాను బట్టి రూ.30 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఫిర్యాదుల నేపథ్యంలోనే వసూలు చేసిన డబ్బును ఉద్యోగులు కార్పొరేషన్లకు జమ చేయాలని ఆదేశిస్తున్నట్లు చెబుతున్నారు.

ఏపీలో నాలుగైదు నెలలుగా చెత్త సేకరణ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మేస్త్రీలు, శానిటరీ సిబ్బంది, సూపర్ వైజర్లు, వార్డు హెల్త్‌ సెక్రటరీలు, పారిశుధ్య విధులు నిర్వర్తించే సిబ్బంది వసూలు చేసిన సొమ్మును ఖజానాకు జమ చేయకపోతే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన చెత్త పన్ను సేకరణ కార్యక్రమంపై ఉద్యోగులతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పారిశుధ్య కార్యక్రమాలు గతానికి భిన్నంగా ఏమి జరగకపోయిన జనాలపై పన్ను భారం మాత్రం తప్పడం లేదు. క్లాప్‌ పేరుతో చేపట్టిన పన్ను వసూళ్లపై ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆస్తిపన్ను, ఇంటి పన్నులతో పాటు కొత్తగా చెత్త పన్నుపై నేతల్ని నిలదీస్తున్నారు.

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా 15వ ఆర్దిక సంఘం నిధులతో పాటు స్మార్ట్‌ సిటి, అమృత్‌ పథకాల ద్వారా నిధులు విడుదల చేయాలంటే కేంద్రం విధించిన షరతుల ప్రకారం పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. చెత్త సేకరణపై పన్ను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించినా ఏపీలో మాత్రమే అత్యధిక నగరాల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు రాజధాని నగరాలు, ప్రధాన కార్పొరేషన్లకు ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 42నగరాల్లో చెత్త సేకరణ పన్ను వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నా ఇప్పటికే వసూళ్లు ప్రారంభించడంతో జనం చాలా ప్రాంతాల్లో తిరగబడుతున్నారు. 2021 అక్టోబర్‌ నుంచి ప్రారంభించిన క్లాప్‌ కార్యక్రమంలో 2164 ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రారంభించారు. వీటిలో 4,328మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ62వేల రుపాయలు చెల్లిస్తున్నారు. ప్రజల నుంచి సేకరించే పన్నులతో వాహనాలకు అద్దెలు చెల్లించాలనే ఒప్పందంపై వీటిని ప్రారంభించారు. ఏపీలో ప్రధానమైన విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, కర్నూలు, ఒంగోలు పట్టణాల్లో కూడా పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో వాహనాలకు డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వసూళ్లు చేయకపోతే జీతాలు కోత విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

Whats_app_banner