Sankranti Travel : పండగ వేళ బాదుడే బాదుడు..! భారీగా టికెట్ ఛార్జీలు, ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో నిలువు దోపిడీ-private travels hiked the ticket prices hugely during the sankranthi festival rush ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Travel : పండగ వేళ బాదుడే బాదుడు..! భారీగా టికెట్ ఛార్జీలు, ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో నిలువు దోపిడీ

Sankranti Travel : పండగ వేళ బాదుడే బాదుడు..! భారీగా టికెట్ ఛార్జీలు, ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో నిలువు దోపిడీ

HT Telugu Desk HT Telugu
Jan 11, 2025 10:04 AM IST

సంక్రాంతి పండగ వేళ ప్ర‌జ‌ల‌పైన బాదుడే బాదుడుకు ప్రైవేట్ ట్రావెల్స్ పూనుకున్నాయి. పండ‌గ కోసం స్వ‌గ్రామాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను నిలువుగా దోచుకుంటాయి. ప్ర‌భుత్వ యంత్రాంగం చూసిచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల‌పై భారం పెరుగుతోంది.

పండిక్కి బాదుడే బాదుడు..!
పండిక్కి బాదుడే బాదుడు..!

సంక్రాంతి నేప‌థ్యంలో టికెట్ల ధ‌ర‌ల‌ను ఇష్టారాజ్యంగా రెండు రెట్లు, మూడు రెట్లు పెంచేసి అడ్డ‌గోలుగా డ‌బ్బులు దండుకుంటున్నారు. దీనిపై నియంత్ర‌ణ విధించాల్సిన రాష్ట్ర ర‌వాణా శాఖ మౌనం దాల్చుతుంది. దీంతో ప్ర‌యాణికుల జేబుల‌కు క‌న్నం ప‌డక‌త‌ప్ప‌డం లేదు.

yearly horoscope entry point

భారీగా పెంచేశారు..!

ఒక్కో టిక్కెట్ పై అద‌నంగా రూ.800 నుంచి రూ.1,000 పెంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజ‌మాన్యాలు వ‌సూలు చేస్తున్నాయి. సాధార‌ణంగా గుంటూరు నుంచి హైద‌రాబాద్‌కు దాదాపుగా ఒక్కొ టిక్కెట్ ధ‌ర‌ నాన్ ఏసీ స‌ర్వీసుకు రూ.450, ఏసీ స‌ర్వీస్‌కు రూ.500, స్లీప‌ర్ ఏసీ స‌ర్వీస్‌కు రూ.650 నుంచి రూ.750 ఉంటుంది.

అదే హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు దాదాపుగా ఒక్కొ టిక్కెట్టు ధ‌ర‌ నాన్ ఏసీ స‌ర్వీసుకు రూ.500, ఏసీ స‌ర్వీస్‌కు రూ.550, స్లీప‌ర్ ఏసీ స‌ర్వీస్‌కు రూ.600 నుంచి రూ.750 (కొన్ని స‌ర్వీసుల‌కు రూ.1,000) ఉంటుంది. కానీ సంక్రాంతి నేప‌థ్యంలో ఈ టిక్కెట్ ధ‌ర‌లను అమాంతంగా పెంచేశారు. ఒక్కో టిక్కెట్టుపై అద‌నంగా రూ.1,000 నుంచి రూ.2,000 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు.

ఇదే ప‌రిస్థితి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్‌లో కూడా ఉంది. ఆయా ట్రావెల్స్ వారి వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల‌లో పెంచిన ధ‌ర‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. పెంచిన ధ‌ర‌లు ఆధారంగా గుంటూరు నుంచి హైద‌రాబాద్‌కు ఒక్కో టిక్కెట్టు ధ‌ర‌ నాన్ ఏసీ స‌ర్వీసుకు రూ.రూ.1,200 నుంచి రూ.2,000, ఏసీ స‌ర్వీస్‌కు రూ.1,300 నుంచి రూ.2,800, స్లీప‌ర్ ఏసీ స‌ర్వీస్‌కు రూ.1,400నుంచి రూ.3,000 ఉంటుంది.

హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు ఒక్కో టిక్కెట్టు ధ‌ర‌ నాన్ ఏసీ స‌ర్వీసుకు రూ.1,400 నుంచి రూ.1,700, ఏసీ స‌ర్వీస్‌కు రూ.1,600 నుంచి రూ.2,900, స్లీప‌ర్ ఏసీ స‌ర్వీస్‌కు రూ.,1,800 నుంచి రూ.3,100 ఉంటుంది.

ఏకంగా రూ.4వేలకు పెరిగింది..!

ఇక హైద‌రాబాద్ నుంచి శ్రీ‌కాకుళానికి సాధార‌ణ‌ంగా రూ.1,800 వ‌ర‌కు టిక్కెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.4,000 వేల వ‌ర‌కు ఉంద‌ని ప్ర‌యాణికులు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలోని మ‌చిలీప‌ట్నం నుంచి శ్రీ‌కాకుళానికి సాధార‌ణ రోజుల్లో టిక్కెట్ రూ.800 ఉంటుంది. ఇప్పుడు రూ.1,500కు పెంచేశారు. ఇలా ఇత‌ర రాష్ట్రాల్లో హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూరుకు వెళ్లే ప్ర‌యాణికులపై ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి పూనుకున్నాయి.

ఈ విష‌యంలో ప్రైవేట్ ట్రావెల్స్ య‌జ‌మానులు సిండికేట్ అయిన‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ర‌వాణా శాఖ ప‌ట్టించుకోక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తి జిల్లాకు చెందిన వారు వేలాది మంది హైద‌రాబాదులో ఉపాధి, ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత బ్ర‌హ్మాండ‌గా చేసే సంక్రాంతి పండ‌క్కి వారంతా సొంత ఊళ్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్ర‌త్యేక స‌ర్వీసులు, రైళ్వే స‌ర్వీసులు కూడా స‌రిపోవ‌టం లేదు. ఇప్ప‌టికే టిక్కెట్లు బుక్ అయిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పైన ప్ర‌జ‌లు ఆధార‌ప‌డక‌ త‌ప్ప‌లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ధ‌ర‌లు పెంచి సోమ్ము చేసుకుంటున్నాయి. ప్ర‌భుత్వ యంత్రాంగ క‌నీసం ప‌ట్టించుకున్న దాఖ‌లు లేవ‌ని విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం