Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరం.. యువతిపై ప్రైవేటు కాలేజీ లెక్చరర్ అత్యాచారం!
Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. తనకు పెళ్లి అయిందని లెక్చరర్ సమాధానం ఇచ్చాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో దారుణం జరిగింది. యువతిపై ప్రైవేటు కాలేజీ లెక్చరర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు గ్రామానికి చెందిన చీలి సురేష్ కుమార్‌కు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కొంతమూరుకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. సురేష్ కుమార్ ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు.

పరిచయం ప్రేమగా..
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మనసులు కలిశాయని, పెళ్లి చేసుకుందామని సురేష్ కుమార్ చెప్పేవాడు. దీంతో ఆ యువతి పూర్తిగా సురేష్ కుమార్‌ను నమ్మింది. ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని బాగా నమ్మించాడు. ఈ క్రమంలో ఆ యువతిపై సురేష్ కుమార్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి పనులు వద్దని, పెళ్లి తరువాతే ఏమైనా అని యువతి అన్నప్పటికీ పట్టించుకోలేదు.
పెళ్లి ప్రస్తావన వచ్చాక..
తననే పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆ యువతి.. ఏమీ అనకుండా మిన్నికుండిపోయింది. ఇటీవల ఆమె ఆయన వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో సరేష్‌కుమార్ తనకు ఇప్పటికే వివాహం అయిందని బదులిచ్చాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రేమికుడి సమాధానంతో ఆ యువతి అవాక్కైంది. చేసేదేమీ లేక ఆత్రేయపురం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు..
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఆ లెక్చరర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని.. ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు.
కోర్కే తీర్చాలని..
తన కోర్కె తీర్చితే గతంలో కలిసి తీసుకున్న ఫొటోలు ఇచ్చేస్తానని యువతిని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు.
పెళ్లి కుదిరాక..
ఈ ఘటన పల్నాడు జిల్లా మాచవరంలో చోటు చేసుకుంది. మాచవరానికి చెందిన యువతికి, అదే మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యువకుడితో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఆ యువతికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
లైంగిక దాడి..
ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. దీంతో యువతి భయపడి ఆయనతో వెళ్లేందుకు సమ్మతించింది. అలా గత నెల (డిసెంబర్) 12న నల్గొండ జిల్లా దేవరకొండకు తీసుకెళ్లాడు. కోర్కె తీర్చితే ఫోటొలు ఇస్తానని.. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
పోలీసులకు ఫిర్యాదు..
ఆ యువకుడి వేధింపులు తాళలేక యువతి మాచవరం పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సతీష్ స్పందిస్తూ.. బాధిత యువతి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మధ్యవర్తిత్వం వహించిన మరో మహిళపై కూడా కేసు నమోదు చేశామన్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)