AP Private Ambulance : అడిగినంత ఇవ్వాల్సిందే.. ఏపీలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దందా!
AP Private Ambulance : ఏపీలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా దందా నడిపిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోణలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని పెద్దాసుపత్రుల కేంద్రంగా ఈ దందా నడుస్తోంది.
రాష్ట్రంలోని వివిధ పెద్ద ఆసుపత్రులకు చికిత్స కోసం ఎక్కువగా పేదలే వస్తుంటారు. ఇలా వచ్చే రోగులు ఎవరైనా మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిందే ధర అవుతోంది. వారు అడిగినంత ఇవ్వకపోతే మరో వాహనంలో కూడా తరలించకుండా చేస్తున్నారు. కొన్నిచోట్ల అడ్డుకొని గొడవలకు దిగుతున్నారు.
అందుబాటులో లేవని..
మహాప్రస్థానాలకు చెందిన అంబులెన్సులు ఉన్నా.. అవి అందుబాటులో లేవని ఆసుపత్రుల సిబ్బందితోనే చెప్పిస్తున్నారు. బాధితులే ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించేలా చేస్తున్నారు. లోపాయికారీ ఒప్పందం చేసుకొని సిబ్బంది కూడా కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అడిగినంత ఇచ్చుకొని మృతదేహాలను స్వస్థలాలకు తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వందల సంఖ్యలో..
ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి సర్వజనాసుపత్రులకు ఎక్కువగా చికిత్స కోసం వస్తుంటారు. నిత్యం వందల సంఖ్యలో రోగులు చనిపోతుంటారు. ఈ ఆసుపత్రుల్లో ఎవరు చనిపోయినా.. అక్కడ పనిచేసే సిబ్బంది క్షణాల్లో అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నేరుగా వార్డులోకి వచ్చి అంబులెన్స్ ధరలు మాట్లాడుకుంటున్నారు.
అడిగినంత ఇచ్చి..
అయితే.. ఆసుపత్రుల్లో మహాప్రస్థానం అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ ఉంటున్నాయి. దీంతో ఆ అంబులెన్స్‌లు బయటకు వెళ్లాయని, ఆరేడు గంటలు వేచి ఉండాలని సిబ్బంది చెబుతున్నారు. ఫలితంగా బాధితులు ప్రైవేటు డ్రైవర్లను ఆశ్రయిస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు అడిగినంత ఇచ్చి మృతదేహాలను తరలిస్తున్నారు.
కరోనా సమయంలో ఇలా..
కరోనా సమయంలో మొదట్లో ఇలాంటి పరిస్థితులో తలెత్తాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మృతదేహాలు తరలించేందుకు ధరల పట్టికను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది. కొవిడ్ కాలం అవి అమల్లో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ వసూళ్ల దందా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న దోపిడీపై అధికారులు దృష్టిపెట్టాలని బాధితులు కోరుతున్నారు.