Visakha Central Jail: జైలు సిబ్బందికి బట్టలు విప్పి తనిఖీలు, జైలు బయట కుటుంబ సభ్యుల ఆందోళన, ఉద్యోగులపై బదిలీ వేటు
Visakha Central Jail: విశాఖసెంట్రల్ జైల్లో ఇద్దరు వార్డర్లకు ఖైదీల ముందే బట్టలిప్పి తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. జైల్లోకి గంజాయి తెస్తున్నారనే అనుమానంతో సోదాలు చేశామని అధికారులు చెబుతుంటే, వేధింపులపై సిబ్బంది, కుటుంబాలతో సహా రోడ్డెక్కడం కలకలం రేపింది.
Visakha Central Jail: విశాఖ సెంట్రల్లో జైల్లో ఖైదీల ముందు వార్డర్లను దుస్తులు విప్పించి సోదాలు చేయించడం సంచలనం సృష్టించింది. జైలు పర్యవేక్షకుడి వేధింపుల్ని నిరసిస్తూ వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో జైలు సిబ్బందిపై బదిలీ వేటు వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
విశాఖ సెంట్రల్ జైల్లో సిబ్బందికి నగ్నంగా తనిఖీలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ జైళ్లలో అధికారులు, సిబ్బందికి మధ్య కొనసాగుతున్న విభేదాలను బయటపెట్టింది.
విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మహేంద్రబాబు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెంట్రల్ జైలులో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులు, ఖైదీల పర్యవేక్షణ విధులు నిర్వర్తించే వార్డర్లు శనివారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. సిబ్బంది ఆందోళనపై ఆరా తీశారు. ఆదివారం విచారణ జరుగుతున్న సమయంలో జైలు సిబ్బంది కుటుంబ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. సూపరింటెండెంట్ వివరణ మాత్రమే తీసుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపించారు.
శనివారం విశాఖ సెంట్రల్ జైల్లో ఇద్దరు వార్డర్లు అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ తనిఖీలు జరిపారు. ఆ సమయంలో వాసుదేవరావు అనే వార్డర్ అధికారులకు ఎదురు తిరిగినట్టు చెబుతున్నారు. తనిఖీలను అడ్డుకోవడంతో పాటు దూషించినట్టు చెబుతున్నారు. అతనిపై చర్యలకు సిద్ధం కావడంతో మిగతా సిబ్బంది విధులకు హాజరు కాకుండా పరిపాలన భవనం గేటు వద్ద నిరసనకు దిగారు.
ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడంతో వివాదం మరింత ముదిరింది. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వెయ్యిమందిలోపు ఖైదీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2వేల మంది వరకు ఉన్నారు. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలను జైల్లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఖైదీలకు అవసరమైన సిగరెట్లు, ఖైనీలు, గంజాయి వంటి వాటిని కింది స్థాయి సిబ్బంది సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం కొందరు సిబ్బంది భోజనం క్యారేజీల్లో గంజాయి తెచ్చారనే అనుమానంతో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో దుస్తులు విప్పించడం వివాదాస్పదంగా మారింది.
ఏపీలో ప్రస్తుతం నాలుగు సెంట్రల్ జైళ్లతో పాటు 8 జిల్లా జైళ్లు, సబ్ జైళ్లతో కలిపి 79 ఉన్నాయి. వీటిలో 8వేల మంది వరకు ఖైదీలు ఉన్నారు. విశాఖ జైల్లో రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఉండటంతో సిబ్బందిపై పని భారం కూడా పెరిగింది. ఈ క్రమంలో జైళ్ల నుంచి నెలవారీ మామూళ్ల కోసం పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ సెంట్రల్ జైలును పర్యవేక్షిస్తున్న అధికారిపై సిబ్బంది తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో సిబ్బందిపై వేటు పడింది. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని రాయలసీమ జైళ్లుకు బదిలీ చేశారు. దీనిని నిరసిస్తూ సిబ్బంది కుటుంబ సభ్యులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు.
విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గంజాయి తనిఖీల పేరుతో వేధిస్తున్నారని, సిబ్బంది క్యారేజీలను కూడా లోపలికి అనుమతించకుండా పరిపాలన భవనం దగ్గర ఆపేస్తున్నారని, లో దుస్తులను కూడా తనిఖీ చేస్తున్నారని జైలు సిబ్బంది ఆరోపించారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మహేంద్ర బాబును ఆరోపణలు తోసిపుచ్చారు. వార్డర్ వాసుదేవరావు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అవినీతి ఆరోపణలపై వాసుదేవరావు ఇప్పటికే రెండుసార్లు సస్పెండ్ అయ్యారని, జైల్లోకి గంజాయి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఖైదీల తరలింపు…
విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66మందిపై బదిలీ వేటు పడింది. వార్డర్స్,హెడ్‌వార్డర్స్‌ను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 37మంది వార్డర్స్‌తో కలిపి 66 మందిపై బదిలీ వేటు వేశారు.