Sri Sathya Sai district : శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం.. హోలీ పేరుతో వికృతంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్
Sri Sathya Sai district : శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల వికృతంగా ప్రవర్తించాడు. స్పెషల్ క్లాస్ పేరుతో విద్యార్థునులను కాలేజీకి రప్పించి.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు అయింది.
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. కదిరి పట్టణంలో ఓ ప్రైవేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి హోలీ పండగ రోజున సెలవు ఇచ్చారు. కానీ ప్రిన్సిపాల్ వెంకటపతి స్పెషల్ క్లాస్ పేరుతో డిగ్రీ విద్యార్థినులను కాలేజీకి రమ్మన్నారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో విద్యార్థినులు కాలేజీకి వచ్చారు. అక్కడ ప్రిన్సిపాల్ హోలీ సంబరాలకు తెరలేపారు. ఈ క్రమంలో రంగులు చల్లుకుంటూ విద్యార్థినులను పదే పదే తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు.
అసభ్యంగా తాకుతూ..
విద్యార్థినులు పరిగెత్తుతుంటే, వారి వెంటపడి తరుముతూ ఎత్తుకోవడం, అవయవాలను తాకుతూ నేలపై పొర్లుదండాలు పెట్టించడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అమ్మాయిలను ఒకరి తరువాత ఒకరిని ఎత్తుకుని బురదలో పడేసి, వారిపై పడి ఎక్కడపడితే అక్కడ తాకడం వంటివి చేష్టలకు దిగారు. దీన్ని గుర్తించిన స్థానికులు ప్రిన్సిపాల్ అసభ్యకర ప్రవర్తనను వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు.
వీడియో వైరల్..
ప్రిన్సిపాల్ ప్రవర్తన, వికృత చేష్టల దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థి సంఘాలు కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టాయి. వెంటనే అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హోలీ సంబరాల్లో విద్యార్థినులను భౌతికంగా తాకుతూ ప్రిన్సిపాల్ వెంకటపతి వ్యవహరించిన తీరుపై కానిస్టేబుల్ గౌసియా ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్..
ఆ ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తి తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారమని, ఇలా ప్రవర్తించడం మంచిది కాదని స్పష్టం చేశారు. ఎవరినీ ఉపేక్షించబోమని, ఇలాంటి చర్యల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారని చెప్పారు.
స్థానికుల ఆగ్రహం..
ప్రిన్సిపాల్ ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత హోలీ అయితే ఇంతలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ అసలు స్వరూపం బయపటడిందని, బయటపడకుండా ఆయన ఇంకేమీ చేశాడో అంటూ చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వి.రత్న విచారణకు ఆదేశించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )