PM Modi Tour: నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన..విశాఖలో భారీ రోడ్ షో, బహిరంగ సభకు ఏర్పాట్లు
PM Modi Tour: ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు.విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో పాటు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.ప్రధాని పర్యటనలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
PM Modi Tour: విశాఖలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వరాదని హెచ్చరించారు.
ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏచిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు. సంబంధిత శాఖల అధికారులు అయా శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు.
ప్రధాని పర్యటన ఇలా…
8వ తేదీ బుధవారం సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. సా.5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గం.లకు సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.15 గం.ల విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖలో సుమారు 3 గం.ల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యంగా వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారని సీఎస్ తెలిపారు.
ఏయూ గ్రౌండ్స్‌లో వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్,నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్,గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, మున్సిపల్ కమీషనర్ తదితర అధికారులను సిఎస్ ఆదేశించారు.
సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్డు షో, సభా వేదిక,వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి,విజయనగరం,శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు,ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.
సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం,భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలక్టర్ సహా పరిసర జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. వాహనాల ట్రాఫిక్,పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డిజిపి,విశాఖ పోలీస్ కమీషనర్లను ఆదేశించారు.
విశాఖనగరంలో ప్రధాని రోడ్డు షోలో సుమారు 80వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభలో లక్షా 80 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ కలెక్టర్ వివరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లనీ దాదాపు పూర్తి కావచ్చాయని ఏర్పాట్లన్నిటినీ మంగళారం రాత్రికి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. విశాఖ పోలీస్ కమీషనర్ ఎస్.బాగ్చి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రధాని ప్రారంభించే పథకాలు ఇవే…
- పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను రూ.1.85లక్షల కోట్లతో ఏర్పాటు చేసే పనులకు శంకుస్థాపన చేస్తారు.
- విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని రూ.149కోట్లతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తారు.
- రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణానికి సంబంధించిన రూ.4593కోట్ల విలువైలన 10 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
- రూ.2139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ నిర్మాణాన్ని చేపడతారు.
- రూ.6028కోట్ల విలువైన 6 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడతారు.
- రూ1877కోట్లతో నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతారు.
- రూ.3044కోట్లతో 234.28 కి.మీ పొడవైన 7 రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
- రూ.5718కోట్లతో రాయలసీమలో 323కి.మీల పొడవున 3 రైల్వే లైన్ల నిర్మాణం చేపడతారు.
ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, సుందరపు విజయ్ కుమార్ , జనసేన పార్టీ నేతలతో రోడ్ షో, సభలను విజయవంతం చేయడంపై చర్చించారు