PM Modi Tour: 3లక్షల మందిలో విశాఖలో ప్రధాని సభ.. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష-prime minister modis visit to visakhapatnam minister nara lokesh reviews the arrangements ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Modi Tour: 3లక్షల మందిలో విశాఖలో ప్రధాని సభ.. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

PM Modi Tour: 3లక్షల మందిలో విశాఖలో ప్రధాని సభ.. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 06, 2025 04:00 AM IST

PM Modi Tour: అందరూ కలిసికట్టుగా మిషన్ మోడ్ తో పనిచేసి జనవరి 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని, ఇదొక చరిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు.

ప్రధాని పర్యటనసై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్‌
ప్రధాని పర్యటనసై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్‌

PM Modi Tour: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలని అందరూ సింగిల్ ఏజెండాతో పనిచేయాలని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్‌ మంత్రులు, అధికారులను కోరారు.

yearly horoscope entry point

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది.

ప్రధాని పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం

ప్రధాన మంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం అని, రాష్ట్ర భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మోడీ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని, ఏ రాష్ట్రానికి కేటాయించని ప్రాజెక్టులను, నిధులను ఏపీకి కేటాయించారని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టేందుకు కేంద్ర మద్దతు చాలా అవసరం. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీయే నినాదం. ఇదేదో కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన పర్యటన కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించినదన్నారు.

నేతలంతా సింగిల్ ఎజెండాతో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి. అందుకు తగ్గట్లుగా ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి. గతంలో విజయవాడలో జరిగిన ప్రధాని రోడ్ షో కంటే మిన్నగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ విజయవాడ రోడ్ షో, చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభల గురించి ప్రధాని ప్రస్తావిస్తుంటారని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.

సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలి

ప్రధానమంత్రి రోడ్ షో కు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం పోలీసు ఉన్నతాధికారులకు సూచించింది. ఎంతమంది తరలివచ్చినా ఎలాంటి ఆంక్షలు విధించకుండా అందరినీ అనుమతించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. రోడ్ షో ను విభాగాల వారీగా విభజించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను మూడు పార్టీల నుంచి ఒక్కొక్క ప్రజాప్రతినిధి చొప్పన సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు చేరేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలో నియోజకవర్గాల వారీగా బ్లాక్ లు ఏర్పాటుచేయాలని, ప్రజాప్రతినిధులు సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరు

ప్రధానమంత్రి బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లుగా వసతులు, భోజన సదుపాయం కల్పించాలని మంత్రుల బృందం ఆదేశించింది. జనసమీకరణ, పార్కింగ్, పాస్ ల పంపిణీపైనా సమావేశంలో చర్చించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికీ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అంతకు ముందు జనవరి 8వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాంగణం మొత్త కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

Whats_app_banner