Nadendla Rice Price: ఏపీలో ఆర్నెల్లకే అటకెక్కిన నాదెండ్ల వారి ధరల నియంత్రణ పథకం, మాయమైన బియ్యం, నూనెల నియంత్రణ
Nadendla Rice Price: ఆంధ్రప్రదేశ్‌లో అధకారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై హడావుడి చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం ధరల్ని నియంత్రిస్తున్నట్టు తెగ హంగామా చేశారు. మాల్స్, బియ్యం, వంట నూనెల విక్రేతలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వాటిని విక్రయించాలని ఆదేశించారు.ఈ ఆర్నెల్లలో ఏమైందంటే..
Nadendla Rice Price: ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు వంట నూనెల ధరల నియంత్రణ హడావుడి ఆర్నెల్లకే ముగిసిపోయింది. మార్కెట్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం చతికిల పడ్డారు. మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారుల ఒత్తిళ్లకు ప్రభుత్వ యంత్రాంగం తలొగ్గడంతో ధరల నియంత్రణ కాస్త అటకెక్కింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరిగిందనేది అందరిలో ఆసక్తి రేకిస్తోంది.
ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నినిత్యావసర వస్తువుల ధరల్ని కొంతైనా తగ్గించేందుకు అధికారంలోకి రాగా గత జులైలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
చుక్కలనంటుతున్న బియ్యం, కందిపప్పు ధరల్ని నేలకు దించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొద్ది నెలలుగా పెరుగుతోన్న ధరల్ని నియంత్రించేందుకు గత ఏడాది జులైలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఓ వైపు వేల కోట్ల రుపాయలు వెచ్చించి పౌరసరఫరాల శాఖ ద్వారా ఇంటంటికి చౌక ధరలతో బియ్యం సరఫరా చేస్తున్నా బహిరంగ మార్కెట్లో మాత్రం నాణ్యమైన బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
2023లో మిగ్‌జామ్ తుఫాను సమయం నుంచి మిల్లర్లు బియ్యం ధరల్ని కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు. ఓ దశలో 26కేజీల బస్తా ధర రూ.1600 దాటేసింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ధర రూ.70కు చేరువైంది. ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ధరను రూ.100కు స్థిరీకరిస్తారని జనం బెంబేలెత్తిపోయారు. బియ్యం ధరల కట్టడి విషయంలో వైసీపీ ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం ఆ పార్టీని నిలువున ముంచేసింది.
వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఎంత మొత్తుకున్నా మొద్దు నిద్ర నటించారు. ఏపీలో బియ్యం ధరలు పెంచాల్సిన అవసరమే లేకపోయినా బహిరంగ దోపిడీకి సహకరించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పౌరసరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని అంతా భావించారు.
కూటమి ప్రభుత్వం గత ఏడాది జులైలో రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం విక్రయించాలని నిర్ణయించింది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి బజార్లలో విక్రయిస్తున్నట్టు గత జులైలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రినాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు.
మూణ్ణాళ్ల ముచ్చటే…
రేషన్ కార్డులపై సరఫరా చేసే బియ్యాన్ని కిలోకు రూ.43.50ఖర్చు చేస్తోంది. అయితే అవన్నీ దొడ్డు రకాలు కావడంతో ప్రభుత్వం సరనఫరా చేసే బియ్యంలో 80శాతం పైగా పక్కదారి పడుతున్నాయి. ఈ క్రమంలో సన్నబియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించడం అందరిలో సంతోషం నింపింది.
రూ.49కు సన్న బియ్యం విక్రయాలకు మాల్స్, హోల్ సేల్ వ్యాపారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇది సరిగ్గా మూడు నాలుగు నెలలు కూడా అమలు కాలేదు. సన్న బియ్యం రకాలు రూ.49కు విక్రయించే పరిస్థితులు లేవంటూ మిల్లర్లు చేతులు ఎత్తేశారు.
వంట నూనెలు, బియ్యం ధరల్ని తగ్గించడంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని భావించినా వాస్తవానికి అలా జరగలేదు. సివిల్ సప్లైస్ చేపట్టిన అరకొర చర్యలు పెద్దగా ఫలితాలనివ్వలేదు. అదే సమయంలో ధరల తగ్గింపుతో తమ వ్యాపారాలకు నష్టం కలుగుతోందని మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో గత రెండు నెలలుగా మార్కెట్లో ఈ బోర్డులు, ధరలు మాయం అయిపోయాయి. గుట్టు చప్పుడు కాకుండా సబ్సిడీ ధరలకు వంట నూనెలు, బియ్యం, కందిపప్పు అమ్మకాలను మాయం చేసేశారు. పండుగల సీజన్‌లో అధిక ధరలకు బియ్యం, నూనెలను కొనుగోలు చేసే పరిస్థితి కల్పించారు.