President Visits Srisailam : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి..-president droupadi murmu visits srisailam temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  President Visits Srisailam : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి..

President Visits Srisailam : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి..

HT Telugu Desk HT Telugu
Dec 26, 2022 02:41 PM IST

President Visits Srisailam : శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Visits Srisailam : దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తొలిసారి హైదరాబాద్ వచ్చారు. శీతాకాల విడిది కోసం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై.. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం.. శంషాబాద్ నుంచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు.

శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. ప్రసాద్ పథకంలో భాగంగా నిర్మించిన భక్తుల వసతి సముదాయాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత అక్కడ్నుంచి.. తెలంగాణ పర్యటనకు బయలుదేరనున్నారు రాష్ట్రపతి. సాయంత్రం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకోనున్నారు. అక్కడ త్రివిధ దళాల అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలో యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడంతో పాటు వీరనారులను సన్మానించనున్నారు. అనంతరం.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇచ్చే విందుకు హాజరవుతారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు... హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు సోమాజిగూడ - హకీంపేట మార్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ నేపథ్యంలో.. కళాశాల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్న రాష్ట్రపతి.. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.