Telugu News  /  Andhra Pradesh  /  President Droupadi Murmu On Telugu Language In Vijayawada Speech
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu : సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది

04 December 2022, 16:44 ISTHT Telugu Desk
04 December 2022, 16:44 IST

Droupadi Murmu On AP : దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎన్నడూ మర్చిపోలేమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి వచ్చారని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu)కు విజయవాడ(Vijayawada)లో పౌర సన్మానం చేశారు. రాష్ట్రపతి ముర్మును గవర్నర్ బిశ్వభూషణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రేమకు బాష అడ్డంకి కాకూడదని.. అందుకే హిందీలో మాట్లాడుతున్నానని చెప్పారు. మీ అందరికీ ధన్యవాదాలు అని తెలుగులో చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

'వెంకటేశ్వరస్వామి కొలువైన ఈ నేలకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ(Vijayawada Kanakadurga) ఆశీస్సులు అందరికీ ఉంటాయి. కూచిపూడి నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎన్నడూ మర్చిపోలేం. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి వచ్చారు. సీఎం జగన్(CM Jagan) నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది.' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి చెప్పారు. భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మెుల్ల.. ఇలా ఏపీకి చెందిన మహనీయుల గొప్పతనాన్ని ద్రౌపదీ ముర్ము గుర్తు చేశారు. ఏపీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. గోదావరి(Godavari), కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఏపినీ పునీతం చేస్తున్నాయన్నారు. నాగర్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయని చెప్పారు.

మీరు ఎదిగిన తీరు ఆదర్శనీయం : సీఎం

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టం అన్నది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికీ కూడా గర్వకారణమని సీఎం జగన్(CM Jagan) అన్నారు. రాష్ట్రపతిగా తొలిసారిగా మన రాష్ట్రానికి వచ్చిన ముర్మును గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా ద్రౌపతి ముర్ము జీవితం ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయమన్నారు. 'మీ జీవితం, మీరు ఎదిగిన తీరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శనీయం. మహిళా సాధికారతకు మీరు ఒక ప్రతిబింబం.' అని జగన్ అన్నారు.

రాష్ట్రపతి(President) పదవికి మీరు వన్నె తీసుకువస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ దేశ ఖ్యాతిని మరింత పెంచడంలో మీరు తప్పక దోహద పడతారన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు.

పౌరసన్మానం అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజభవన్‌లో(Raj Bhavan) విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. రాష్ట్రపతికి జ్ఞాపిక బహూకరించారు.