Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అయితే సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల మృతిపై వివిధ కోణాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రవీణ్ భార్య జెస్సికా, సోదరుడు కిరణ్ లు వీడియోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు.
"ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారం కోరుకుంటున్నాను. ప్రవీణ్ మరణంపై పూర్తి దర్యాప్తు జరిపాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దర్యాప్తు జరుగుతున్న సందర్భంగా అందరికీ విజ్ఞప్తి...కొందరు ప్రవీణ్ మరణంపై స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ను నిలిపివేయండి. ఎందుకంటే ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొంతమంది యూట్యూబర్లు , బ్లాగర్లు అతని మరణంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు దీనిని మతపరంగా, రాజకీయపరంగా వినియోగించుకుంటున్నారు. ప్రవీణ్ సమాజంలో మత సామరస్యాన్ని కాపాడాలని భావించేవారు. ఆయన సేవలను గౌరవించేందుకు, దయచేసి ఇటువంటి కార్యకలాపాలను నిలిపివేయండి. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది. అందువల్ల దయచేసి మత సామరస్యాన్ని భంగం కలిగించకండి" -ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు
"తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు. ప్రవీణ్ మృతిపై స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని కొందరు వాడుకుంటున్నారు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మతవిద్వేషాలు ఎట్టిపరిస్థితుల్లో రెచ్చగొట్టరు. నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ మతసామరస్యస్యాన్నే కోరుకునేవారు. నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుంది. ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం చాలా దారుణం" - ప్రవీణ్ భార్య జెస్సికా
ఒక వ్యక్తి మరణిస్తే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. కానీ కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం ఆ వ్యక్తి కులాన్నో, మతాన్నో అడ్డు పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం దారుణం అని టీడీపీ అభిప్రాయపడింది. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో పూటకో కథ అల్లుతూ కొన్నిశక్తులు ఇలాగే పనిచేస్తున్నాయని మండిపడింది. ఈ దారుణాన్ని ప్రవీణ్ భార్య జెస్సికా, సోదరుడు కిరణ్ లు ఖండించారని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని, పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందని తెలిపింది. బాధలో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని వారిద్దరూ చెప్పారు.
సంబంధిత కథనం