Prakasam Crime : అల్లుడి హత్యకు మామ సుపారీ, పనికాకపోవడంతో అప్పు తీర్చడంలేదని ఫిర్యాదు-పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
Prakasam Crime : కూతురు కూలంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి...అల్లుడ్ని హత్య చేయించేందుకు ఓవ్యక్తికి రూ.3 లక్షలు సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న వ్యక్తి హత్య చేయలేదు. అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని, అల్లుడిని హతమార్చేందుకు మామే సుపారీ ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వలేదని మామే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల విచారణతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టుకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేర్వేరు. అయినప్పటికీ ఐదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇది అమ్మాయి కుటుంబీకులకు నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి కుమార్తె, అల్లుడికి ఆమె తండ్రి దూరంగా ఉంటున్నాడు. అల్లుడు వేరే కులానికి చెందిన వాడు కావడంతో ఆయనపై మామ ద్వేషం, కక్ష పెంచుకున్నాడు.
అల్లుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన కుమార్తె తనతో వచ్చేస్తుందని, తన కులంలోనే వ్యక్తిని చూసి పెళ్లి చేయొచ్చని తండ్రి భావించాడు. అల్లుడిని హత్య చేసేందుకు ఏకంగా ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. ఆ వ్యక్తిది కూడా అల్లుడి స్వగ్రామం పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామమే. గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి రూ.3 లక్షల సుపారీ ఇచ్చాడు. అయితే యువతి తండ్రి పెద్దారవీడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన వద్ద డబ్బులు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశాడు.
అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు ఇవ్వడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసును లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో మామపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, కుట్ర కేసులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో మామ వైఖరితో తాను చేసిన తప్పును తానే బయటపెట్టుకున్నట్లు అయింది. అయితే అల్లుడి హత్యకు మామ సుపారీ ఇచ్చిన పని మాత్రం పూర్తి కాలేదు.
తాను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చానని పని కాలేనందున తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని యువతి తండ్రి డిమాండ్ చేశాడు. అందుకు సుపారీ తీసుకున్న వ్యక్తి నిరాకరించాడు. సుపారీ ఇచ్చిన డబ్బులకు ఎటువంటి ఆధారాలు ఉండవు. అందువల్ల యువతి తండ్రి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగి, సుపారీ తీసుకున్న వ్యక్తి తాను ఇవ్వలేనని స్పష్టం చేశాడు. సుపారీ ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోవడంతో ఆ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఆయన వద్ద నుంచి ఎలాగైనా తన డబ్బులు వసూలు చేయాలని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
సుపారీ ఇచ్చిన డబ్బులను అప్పుగా ఇచ్చినట్లు చిత్రీకరించి పోలీసులతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకునే యువతి తండ్రి ఎత్తుగడలు చిత్తు అయ్యాయి. పోలీసులు విచారణతో తీగలాగితే మొత్తం డొంకే కదిలింది. దీంతో డబ్బులు వసూలు చేసుకునేందుకు వెళ్లి యువతి తండ్రి ఇప్పుడు నిందితుడయ్యాడు. ఈ వాస్తవాలు వెలుగులోకి రావడంతో యువతి తన తండ్రి కుట్రలను తెలుసుకుంది. తన తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని ఆమె సహించలేకపోయింది. అంతే కాకుండా యువతి కుటుంబీకులకు కూడా అవాక్కయ్యారు. ఇప్పుడు ఆయన నిందితుడిగా పోలీసులు ముందు ఉన్నాడు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం